Hanamkonda News : హనుమకొండ జిల్లాలో ప్రేమోన్మాది బరితెగించాడు. తనను ప్రేమించడం లేదని ప్రియురాలి గొంతు కోశాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అనూష అమ్మానాన్నలతో కలిసి హనుమకొండ జిల్లా పోచమ్మకుంట గాంధీనగర్ లో ఉంటూ కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న అనూషను తన ప్రేమపై ఏ విషయం తేల్చాలని అజార్ అనే వ్యక్తి గుర్తు తెలియని ఆయుధంతో గొంతు కోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు చికిత్స కోసం అనూషను ఎంజీఎం హాస్పిటల్ తరలించారు.
ప్రేమోన్మాది అరెస్టు
హనుమకొండ జిల్లాలోని గాంధీ నగర్‌లో అనూష అనే విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది అజార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన జరిగి 24 గంటల్లోనే అజార్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించారు. నిందితుడిని దాడి చేయడానికి గల కారణాలపై ప్రశ్నిస్తున్నామని తెలిపారు. రంగంపేట మండలం నకిరేపల్లి గ్రామానికి చెందిన అనూష ఎంసీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్ ప్రేమ పేరుతో అనూషను వేధించేవాడు. అనూష అతని ప్రేమను నిరాకరించింది.
విద్యార్థిని పరిస్థితి నిలకడగా
అనూష శుక్రవారం వరంగల్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అజార్ వరంగల్ చేరుకున్నాడు. తన విషయం తేల్చాలని ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో అజార్ కత్తితో అనూష గొంతుకోశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలు పాలైన అనూషను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం డాక్టర్స్ తెలిపారు. 48 గంటల పాటు వైద్యుల అబ్జర్‌వేషన్‌లో ఉంచుతామని తెలిపారు.
వరంగల్ ఘటనపై గవర్నర్ తమిళి సై ఆరా
వరంగల్ లోని నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష అనే విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడి గురించి తెలిసి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి వరంగల్ ఎంజీఎమ్ హాస్పిటల్ లో వైద్యం అందుకుంటున్న అనూష ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్ సూపరిటెండెంట్ తో గవర్నర్ ఫోన్ లో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందిచాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.