మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తిని తన కుమార్తె ఎదుటే నడిరోడ్డుపై కొట్టారు. దీంతో బెంబేలెత్తిపోయిన బాలిక అక్కడికక్కడే బావురుమని ఏడ్చేసింది. పోలీసుల తీరుకు నిరసనగా అతను రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడంతో పోలీసుల తీరుపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మళ్లీ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇక హెల్మెట్ ధరించే నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి మాస్కు, హెల్మెట్ ధరించకుండా తన కుమార్తెతో బయటకు వచ్చాడు. దీంతో అతణ్ని ఆపి పోలీసులు ప్రశ్నించగా.. ఎదురు ప్రశ్నించాడు. మాటా మాటా పెరగడంతో పోలీసులకు ఆగ్రహం పెరిగిపోయి చేయి చేసుకున్నారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురితో మహబూబాబాద్‌లో కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గ మధ్యలో కురవి గేట్ సమీపంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్‌ను పోలీసులు ఆపి బైక్ తాళం లాక్కున్నారు. తాళం ఎందుకు తీసుకున్నారని అడిగితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నావని తిట్టారని, దానికి ఫైన్ కడతానని చెప్పినా వినిపించుకోకుండా.. ఎదురు సమాధానం చెప్పానని రోడ్డుపైనే విపరీతంగా కొట్టారని బైకర్ చెప్పాడు.
అయితే, పోలీసులు శ్రీనివాస్‌ని కొడుతున్న సమయంలో పక్కనే ఉన్న అతని కూతురు ‘ప్లీజ్ మా డాడీని కొట్టొద్దు’ అని పోలీసులను వేడుకుంది. నడిరోడ్డుపైనే వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురు రోదించడం చూసిన శ్రీనివాస్ పోలీసుల తీరుకు నిరసిస్తూ రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేశారు. అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు దిగివచ్చి క్షమాపణ కోరారు.
Also Read: Hyderabad Omicron: హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ మహిళకు ఒమిక్రాన్ ఉందా? రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..
Also Read: Sircilla: సిరిసిల్ల యువకుడి వినూత్న ఆవిష్కరణ.. ట్రక్కులు తిరిగి ఖాళీగా రాకుండా అద్భుత ప్లాన్
Also Read: Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి
Also Read: DH Srinivasa Rao: ఒకట్రెండు నెలల్లో భారత్ లో కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి