Mahabubabad News: మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పాఠశాలలో తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో మమేకమై ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తోందని విద్యార్థులకు తెలియజేశారు. పిల్లలల్లో ఆత్మస్థైరం పెంపొందించే విధంగా పాఠ్యాంశాలు భోదించాలని ఉపాధ్యాయులకు సూచించారు.






14 హాస్టళ్ల నిర్మాణం కోససం రూ.140 కోట్లు విడుదల


అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.  ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి విద్య అందిచడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా 14 హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.140 కోట్ల నిధులను విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు.






రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 గురుకుల పాఠశాలలకు ఒక్కో గురుకులానికి అదనపు సౌకర్యాలు, బిల్డింగ్ బ్లాకుల ఏర్పాటుకు 5 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని ఏర్పాటు చేసిన గురుకులాల్లో.. కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించడంతోపాటు చక్కని భోజనం, సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, ఇతర అధికారులు ఉన్నారు.






అనంతరం ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్బంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో తొలిసారిగా ప్రపంచ వారసత్వ వేడుకలను నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాటు చేసిన సందర్భంగా అధికారులతో కలిసి పరిశిలించి పలు సూచనలు చేశారు.