Mayor Gundu Sudharani: నీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ధర్మసాగర్ పైపు లైనుల స్లూయిజ్ వాల్వ్ లను పరిశీలించిన మేయర్.. ఆటంకం లేకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం లేకుండా  చిత్తశుద్దితో పని చేయాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు.


నిర్దేశిత షెడ్యూలు ప్రకారం రిజర్వాయర్ లను నింపడంతో పాటు నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇందుకోసం రిజిస్టర్ లో ప్రతి రోజు నీటి విడుదల సంబంధిత సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్లు వాల్వ్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కరీంబాద్, సుభాష్ నగర్, ఓహెచ్ఎస్ఆర్ ల పరిధిలో మంచి నీటి సరఫరా జరగడం లేదన్న ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. 




ప్రస్తుతం నీటి సరఫరాలో సమస్యలు 


అండర్ రైల్వే జోన్ పరిధిలో ప్రాంతంలో గతంలో ప్రతి రోజు నీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం మాత్రం సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. ధర్మసాగర్ నుండి నీటి సరఫరా సక్రమంగానే ఉన్నప్పటికీ, ఆపరేటింగ్ నిర్వహణ సరిగ్గా లేక స్థానికులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. వాల్వ్ ఆపరేటింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ట్యాంక్ లు నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి బండ్ సమీపంలోని నీటి రిజర్వాయర్ కు గతంలో మాదిరిగా దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుండి నీటి సరఫరా జరిగేలా చూడాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈలు సంతోష్ బాబు, నరేందర్, రవి కిరణ్, ఏఈలు వెంకటేశ్వర్లు, మోజామిల్, హబీబ్, వర్క్ ఇన్స్పెక్టర్ లు, లైన్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.