Ayodhya Rammandir Opening: అయోధ్య రామమందిరం నిర్మాణంలో తెలుగు వారి పాత్రఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఆలయ తలుపు, రాముని పాద ప్రతిమలు, లడ్డుతో పాటు ఆలయ నిర్మాణంలో తెలంగాణకు చెందిన గ్రానెట్ ను ఉపయోగించడం జరిగింది. ఆలయ నిర్మాణ డిజైన్, టెక్నాలజీని తెలంగాణ ప్రాంతం వరంగల్ కు చెందిన నిట్ విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు రూపొందించారు. వెయ్యి సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండడం కోసం కాకతీయుల సాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదితో నిర్మాణం జరిగింది.  


పీఎంవోకు లేఖ
అయోధ్య రామమందిరానికి పునాదుల డిజైన్ చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ పాండు రంగారావు. తొలుత ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్ పైల్స్ తో డిజైన్ చేశారు. ఆలయ ట్రస్టు ఆమోదంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఒక్కోటి మీటర్ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్ పైల్స్ తో పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్ ఏర్పాటు చేసి దాని మీద ఆలయ నిర్మాణం చేపట్టాలి. ఆలయం సరయు నది ఒడ్డున ఉండడం, భూకంపాల తాకిడి తట్టుకోకపోవడంతో పాటు సిమెంట్ కాంక్రీట్ పైల్స్ వయసు వందేళ్లలోపు మాత్రమే ఉంటుందంటూ వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దానికి బదులు కాకతీయులు అనుసరించిన శాండ్ బాక్స్ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యి సంవత్సరాల జీవిత కాలం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. 


రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించినట్లు పాండు రంగారావు చెప్పారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారన్నారు. నిర్మాణ ప్రాంతం వెంట వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారని ఆయన చెప్పారు.            


వెయ్యేళ్లు ఉండేలా పునాది
దీంతో ఆ కమిటీ నాటి పునాది డిజైన్ ను తిరస్కరించి 40 అడుగుల మేర మట్టిని తీసి ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసిందని పాండు రంగారావు తెలిపారు. దీంతో పునాది కనీసం వెయ్యి సంవత్సరాల పాటు ఉంటుందని  పాండురంగారావు చెప్పారు. నా సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి వెయ్యి సంవత్సరాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా నిర్మాణం ఉండబోతుండడం సంతోషంగా ఉందని పాండురంగారావు చెప్పారు. రామమందిర నిర్మాణానికి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన గ్రానెట్ వాడడం విశేషం. అయోధ్య రామమందిరం నిర్మాణంలో తెలుగు వారిపాత్ర ఉండడం శ్రీరాముడి ఆశీస్సులు అని ఆయన అన్నారు.