ఎలాగైనా తెలంగాణ పాగా వెయ్యాలన్న కసితో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. అధికారమే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వరుస సభలు సమావేశాలతో తెలంగాణలో హోరెత్తిస్తోంది. ప్రధానంగా బీజేపీ వినిపించేలా ప్లాన్ వేస్తోంది. 


గత కొన్ని నెలలుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. దీన్ని విడతల వారీగా నిర్వహిస్తూ మధ్య మధ్యలో భారీ బహిరంగ సభలు పెట్టి టీఆర్‌ఎస్‌ చర్యలను ఎండగడుతోంది. ఇప్పుడు మూడో విడత యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో పెద్ద మీటింగ్ పెడుతోంది. 


మొన్నటికి మొన్న మునుగోడు వేదికపై రాజగోపాల్‌ జాయినింగ్ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు హాజరైన అమిత్‌షా... బీజేపీ రాజకీయం ఎలా ఉంటుందో కాస్త ట్రైలర్ చూపించారు. కేసీఆర్‌ హామీ ఇచ్చి అమలు చేయని వాటిని గుర్తు చేసి ప్రజల్లో చర్చకు తెరతీశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశమై... ఇప్పటి వరకు దాని ఎఫెక్ట్ ఉండేలా చూసుకున్నారు. 






ఇప్పుడు బండి సంజయ్ యాత్ర ముగింపు సభకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మరో హీరోతో సమావేశమవుతున్నారు. అంతేకాదు మరికొందరు ప్రముఖులతో కూడా భేటీ అవుతారని టాక్ నడుస్తోంది. వరగల్‌ సభలో ఇంకా ఎలాంటి విమర్శలు ఉంటాయో చూడాలి. 


అమిత్‌షా సభ తర్వాత తెలంగాణలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు అయ్యారు. బండి సంజయ్‌ యాత్రకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చివరకు కోర్టు మెట్లు ఎక్కి సభకు అనుమతి తెచ్చుకుంది బీజేపీ.


బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఆగస్టు 2న యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమైంది. 22రోజుల పాటు కొనసాగిందీ యాత్ర. యాదాద్రిలో ప్రారంభమైన యాత్రను వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వద్ద ముగించనున్నారు. ఈ సందర్భంగానే హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 


తీవ్ర ఉద్రిక్తతలు, విమర్శలు, ఉత్కంఠ మధ్య ఈ సభకు అనుమతి వచ్చింది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ భారీగా జనసమీకరణ చేపట్టింది. ఈ సభతో గులాబీ దళానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. మధ్యాహ్నానికి హన్మకొండ చేరుకోనున్న నడ్డా... బండి సంజయ్‌తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రానికి రాజగోపాల్‌రెడ్డితో సమావేశమై మునుగోడు ఉపఎన్నికలపై చర్చిస్తారు. బహిరంగ సభ పూర్తైన తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో నితిన్‌ సహా ప్రముఖులతో సమావేశమవుతారు నడ్డా. ఆదివారం తిరిగి పయనమవుతారు.