Warangal News : భార్యకు హైదరాబాద్‌లో ఉండాలని కోరిక. భర్తకేమో వర్క్‌ఫ్రమ్‌హోం అవకాశం ఉంది. ఇదే వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. పెళ్లై నెలలు నిండక ముందే కాపురంలో చిచ్చు రేగింది. ఇప్పుడు ఓ ప్రాణం పోయింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి వాసి రాకేష్‌ హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మంచి జీతం, మంచి కంపెనీలో ఉద్యోగం. అంతేకాదండోయ్‌ కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి వర్క్‌ఫ్రమ్ హోం చేస్తున్నాడు. హ్యాపీ లైఫ్‌లో ఓ తోడు ఉంటే బాగుంటుందని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు. 


వర్క్ ఫ్రమ్ హోమ్ 


ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు హ్యాపీగా నడుస్తోంది లైఫ్. వర్క్‌ఫ్రమ్‌ కావడంతో అంతా కూల్‌ అనుకున్న టైంలో సమస్య మొదలైంది. హైదరాబాద్‌ ఎప్పుడెళ్తామంటూ భార్య నుంచి ఒత్తిడి మొదలైంది. కంపెనీ ఇంకా వర్క్‌ఫ్రమ్‌హోం చేయమంటోందని... కంపెనీ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్లిపోదామని సర్ది చెబుతూ వచ్చాడు. నెల రోజులు గడిచిన తర్వాత భార్య గర్భవతి అయ్యానని గుడ్‌ న్యూస్ చెప్పింది. అంతే ఎగిరి గంతేశాడు రాకేష్. అప్పుడు కూడా భార్య అడిగింది ఒక్కటే... హైదరాబాద్‌ ఎప్పుడు తీసుకెళ్తావని రాకేష్‌ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. కుమార్తె గర్భవతి అని తెలియగానే పుట్టింటి వాళ్లు అత్తారింటి నుంచి  ఆమెను తీసుకెళ్లారు. 


అత్తమామ కూడా వేధింపులు 


వర్క్‌ఫ్రమ్‌హోం సమస్య కొన్ని రోజులు పోస్ట్‌పోన్ అయింది అనుకొని రిలాక్స్ అయ్యాడు రాకేష్. ఇంతలో ఫోన్ మోగింది. అదీ వీడియో కాల్. భార్య నుంచి వచ్చిన ఆ ఫోన్ ఎత్తాడు. అటు నుంచి అత్తమామ మాట్లాడారు. ఏమయ్యా పిల్లను హైదరాబాద్‌ తీసుకెళ్తావని కదా పెళ్లి చేసింది. ఇంకెప్పుడు తీసుకెళ్తావు అని గట్టిగా అడిగారు. భార్యను సర్దిచెప్పాల్సిన అత్తమామ అలా అడిగేసరికి షాక్ తిన్నాడు రాకేష్. కంపెనీ ఇంకా పిలవలేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. 


హైదరాబాద్ కు తీసుకెళ్లు లేకుంటే చచ్చిపో 


ఇలా రోజూ ఫోన్ చేసి ఇదే టార్చర్‌ చేసేవారట. రోజురోజుకు ఆ టార్చర్ డోస్ పెంచుతూ వచ్చారు. మొన్నటికి మొన్న వీడియో కాల్ చేసిన భార్య... తీసుకెళ్తే హైదరాబాద్‌ తీసుకెళ్లు లేకుంటే చచ్చిపోమందట. ఆ మాటకు కంటి నిండా నీళ్లు తిరిగాయి రాకేష్‌కు. ధైర్యం చేసి భార్యను అడిగేశాడు. చావుకు, హైదరాబాద్‌కు ఏంటి లింకని... నువ్వు చచ్చిపోతే కదా.. వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటానని బదులిచ్చింది. అంతే రాకేష్‌ కాళ్లకింద భూమి కుంగినంత పని అయింది. నోట మాట రాలేదు. కాల్‌కట్‌ చేశాడు. భార్య అత్తమామల మాటలు రాకేష్‌ మనసుకు చాలా బాధ కలిగించాయి. ఎంత ప్రయత్నించినా ఆ మాటలు మర్చిపోలేకపోయాడు. తీవ్రంగా కుంగిపోయాడు. అంతే సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృతుడి భార్య, అత్తమామను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read : Cyber Crime : గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేస్తే రూ.1.24 లక్షలు మాయం


Also Read : గుంటూరులో నకిలీ యూనివర్శిటీ - ఓ సారి మీ సర్టిఫికెట్ సరి చూసుకుంటే బెటర్ !