Kuppam Chandrababu :  ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు కుప్పంలో విమర్శించారు. కుప్పంలో మూడో రోజు పర్యటనలో ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడలేదు. గురువారం నాటి కుప్పం ఘటన తానెన్నడూ చూడలేదన్నారు. వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ ప్రతాపాలు తన దగ్గర కాదు... జగన్‌ దగ్గర చూపించుకోవాలన్నారు. తానిచ్చిన ఇళ్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పులివెందులకు టీడీపీ హయాంలోనే నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల పొట్టకొట్టిన వైసీపీ శ్రేణులకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగిందని విమర్శించారు.  పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం డీజీపీయేనని అన్నారు. 


మూడో రోజు ప్రశాంతంగా చంద్రబాబు పర్యటన


 మూడోవ రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలంలో పర్యటిస్తున్న చంద్రబాబు హంద్రీనీవా పనులను పరిశీలించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా..ఇప్పటి వరకూ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదు.. కనీసం రైతులకు ఎంతగానో ఉపయోగపడే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు కూడా ఎక్కడికక్కడే నిలిపి వేశారని మండిపడ్డారు.. టిడిపి హయాంలో  హంద్రీ నీవా పనుల కోసం విడుదల చేసిన డబ్బులు సైతం ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హంద్రీనీవా పనులు పూర్తి చేయక పోతే జగన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.


హంద్రీనీవా పనులను జగన్ పూర్తి చేయాలేకపోయారని చంద్రబాబు ఆగ్రహం


హంద్రీనీవా పనులు ఎందుకు పూర్తి చేయలేదని, కారణం చెప్పాలని చంద్రబాబు వైసీపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. అంతే కాకుండా కుప్పంలో టిడిపి నాయకులపై దాడి చేయించడమే కాకుండా తిరిగి తమ నాయకులపైనే కేసులు పెట్టించారన్నారు.. తమపై దాడి చేసారంటూ వైసీపి నేతలపై కేసు పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వైసీపి నాయకుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తమ పార్టి నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేయడం దారుణం అన్నారు..గత రెండు రోజులుగా కుప్పంలో జరుగుతున్న పరిణామాలపై, వైసీపి నాయకులపై, పోలీసులపై ప్రైవేటు కేసు వేసి కోర్టుకు లాగుతానని చంద్రబాబు హెచ్చరించారు. నిన్న సివిల్‌ డ్రెస్సులో పోలీసులు కర్రలు తీసుకుని వచ్చారని, వాళ్లు, వాళ్లను ప్రోత్సహించినవారు ఎవరో తెలియాలని, కేసులు వేసి.. వారి పని పడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.


ప్రజల నుంచి ఆర్జీలు తీసుకున్న మాజీ సీఎం 


కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో పర్యటించారు.  ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.  మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని... బాబాయ్‌ వివేకను చంపిన వ్యక్తికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. వైసీపీ ఆరిపోయే దీపమని... ఇకపై జగన్ ఆటలు సాగవన్నారు. టీడీపీ (TDP) ధర్మ పోరాటానికి ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు  కోరారు.