TS High Court : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర శుక్రవారం తిరిగి ప్రారంభం అయింది. అయితే ఈ పాదయాత్ర ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.  బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పోలీసులు ఇచ్చిన నోటీసులు సస్పెండ్ చేశారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.  ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరిపేందుకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అంగీకరించింది.


సింగిల్ జడ్జి ఆదేశాలు 


ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వర్దన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సింగిల్ జడ్జి గురువారం సస్పెండ్ చేసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.  వరంగల్‌ భద్రకాళి ఆలయం వద్ద ఈ నెల 27న ప్రజా సంగ్రామ యాత్రను ముగించనున్నట్లు ఇప్పటికే బండి సంజయ్‌ ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని తెలుస్తోంది.  హైకోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. 


ముగింపు సభకు అనుమతి నిరాకరణ


మరోవైపు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆ  సభకు అనుమతిని కాలేజీ ప్రిన్సిపల్ నిరాకరించారు. పోలీసుల నుంచి తమకు సమాచారం లేదని, అందుకే సభకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావాల్సి ఉంది. అయితే అనుమతి నిరాకరణపై బీజేపీ హై కోర్టుకు వెళ్లింది.  


పాదయాత్రలో ఉద్రిక్తత 


హైకోర్టు అనుమతితో ఇవాళ పాంనూర్‌ నుంచి బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉప్పుగల్‌, కోనూర్‌, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడత పాదయాత్ర ముగియనుంది. బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రం విషయంలో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆ యాత్ర ఆపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, నిన్న సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు బండి సంజయ్ నేడు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించగా, నేడు కూడా ఆ యాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. బండి సంజయ్‌ గోబ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలోకి చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. 


సభలు, ర్యాలీలపై నిషేధం 


వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషీ తెలిపారు.  నగరంలో శాంతి భద్రతలు, ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశంతో నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు నిషేధం అమల్లో ఉంటుందన్నారు.  ఈ ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  


Also Read : TRS Tension : టీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్ టెన్షన్ ! బీజేపీపై ఆ దూకుడు చూపించలేకపోతున్నారా ?