TRS Tension :  తెలంగాణలో ఇప్పుడు బీజేపీ చూపిస్తున్న దూకుడు అంతా ఇంతా కాదు. నేరుగా ఢిల్లీ నుంచి గురి పెట్టారు. ఇక్కడ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. వాటిని సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు అంటున్నారు కానీ గట్టిగా వాదించలేకపోతున్నారు. కోర్టులకు వెళ్లి అలాంటి ఆరోపణలు చేయుకండా స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీలో బీజేపీపై గొంతెత్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. కొంత మంది ముఖ్య నేతలు తప్ప ఇతరులు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్‌లోనూ బీజేపీని ఎదుర్కోవడంలో వెనుకబడ్డామన్న విశ్లేషణ ప్రారంభమయింది. 


లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలతో టీఆర్ఎస్ నేతల్లో అలజడి !


బీజేపీ టార్గెట్ చేస్తోందని తెలుసు కానీ.. కేసీఆర్ కుమార్తెను లక్ష్యంా చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఉందని బీజేపీ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా నిప్పు లేకపోతే పొగరాదన్న చందంగా చూస్తున్నారు.  స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రాజీనామా చేయాలని ఈ నెల 22న బీజేవైఎం ఆధ్వర్యంలో కవిత ఇంటిని ముట్టడించారు.  బీజేపీ కేంద్ర నాయకత్వం కవిత పూర్తిగా మునిగిపోయారని ముందు ముందు చాలా ఉంటుందని చెబుతోంది.  దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తోంది.    ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకే పార్టీ నానాతంటాలు పడుతున్నారు.


కేసీఆర్ సన్నిహిత నేతల్లోనూ ఆందోళన !


బీజేపీ రాజకీయం భిన్నంగా ఉంది. నేరుగా నెంబర్ వన్ ను ఢీకొట్టడం లేదు. ముందుగా బలహీనం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది ఇదే. తెలంగాణలోనూ అదే జరుగుతోంది.  కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు అందులో భాగంగానే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారిస్తే చిక్కులు ఏర్పడతాయి. ఎప్పుడు  ఎవరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతాయోననే భయం మొదలైంది. ఒక వేళ దాడులు జరిగితే.. ఏమవుతుందోనని ఎక్కువ మంది టెన్షన్ పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సహకరించకపోవడం, రావాల్సిన నిధులను అడ్డుకట్ట వేయడం, మరోవైపు అవినీతి మరకలు అంటించడం, కేసీఆర్ పై సైతం మాటల తూటాల వేగం పెంచడంతో ఏం జరుగుతోందో అర్ధంకాని పరిస్థితి గులాబీ నేతల్లో నెలకొందని తెలుస్తోంది. 


పెరిగిపోతున్న దర్యాప్తు సంస్థల భయం !


తెంగాణ సర్కార్ .. కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. కేంద్రం ఆ విషషయాన్ని సీరియస్‌గా తీసుకుందో లేదో స్పష్టత లేదు. రాష్ట్రానికి కేంద్రంతో వైరం కొనసాగిస్తే.. రాష్ట్రానికి ఆర్థిక గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు రాబోయే కాలంలో నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ కుమార్తెపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేయడం, ప్రస్తుతం ఏం జరుగుతుందో, ఏం చేయాలో అర్ధం కాక గులాబీ ప్రజాప్రతినిధులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఒక వైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, మరో వైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అయితే టీఆర్ఎస్ నేతల్లో  ధైర్యం మాత్రం క్రమంగా తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.