Who is Jharkhand Next CM : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ ప్రారంభమయింది. హేమంత్ భార్య కల్పన సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. 81 సీట్సు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి కలిపి 47 సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక సీటు ఖాళీ కావడంతో 46 ఉన్నట్లు అవుతాయి. ఆర్జేడీకి ఒక్క సీటే ఉండగా కాంగ్రెస్‌కు పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం నుంచే సీఎం అభ్యర్థి ఉంటారు.
జార్ఖండ్‌లో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ..ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 41
బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో తొమ్మది మంది చిన్న పార్టీలు.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే తమకు ఉన్న బలం కాక పదహారు మంది మద్దతు కూడగట్టాలి. ఆ దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తుందో లేదో స్పష్టత లేదు. కానీ జేఎంఎం మాత్రం... హేమంత్ సోరెన్ సతీమణినే సీఎం చేయాలని అనుకుంటోంది. సోరెన్ సతీమణి రాంచీలో కల్పన జన్మించారు. 2006లో హేమంత్ సోరెన్‌ను కల్పన వివాహం చేసుకున్నారు.
సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌కు సీఎం కుర్చీపై కూర్చోబెట్టే అవకాశం
ప్రభుత్వ వేదికలపై ఆమె కనిపించడం చాలా తక్కువ. వ్యాపార రంగంలో రాణిస్తూనే ఓ ప్రయివేటు స్కూల్‌ను నడుపుతున్నారు. మహిళా సాధికారత, పిల్లల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక పలు ఫంక్షన్లలో కల్పన తరుచుగా కనిపిస్తుంటారు. రాజకీయ కుటుంబానికి కోడలు అయినా కల్పన.. సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. రేపోమాపో సీఎం మార్పునకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అకాశం ఉంది.
సోరెన్ శాసనసభ్యత్వం రద్దు చేసిన గవర్నర్
స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరేన్ పొందారంటూ గవర్నర్ రమేశ్ బాయిస్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సొరేన్ తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం రఘుబర్‌దాస్ ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 9ఏ ప్రకారం సొరేన్‌పై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) గవర్నర్ కోరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీల్డ్ కవర్‌లో తన అభిప్రాయాన్ని ఈసీ.. రాజ్‌భవన్‌కు పంపించింగా, శుక్రవారం సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదల్చుకుంటే మాత్రం అక్కడ రాజకీయాలు కీలకంగా మారనున్నాయి. బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా అంతా గుంభనంగా సాగిపోతాయి. చివరికి ట్విస్టులు వెలుగులోకి వస్తాయి.