Congress Needs Troubleshooter:


సీనియర్ నేతల అలకలు..


"మునిగిపోయే ఓడకు...ఎవరు Captain అయితే ఏముందిలే". ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో కొందరు ఇలానే నిష్ఠూరమాడుతున్నారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ గురించి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుందని..బహుశా కాంగ్రెస్ కూడా ఊహించి ఉండదు. ఓ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అదేంటో..కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇది రివర్స్. ఆ పదవి మాకొద్దంటే మాకొద్దని అందరూ వెనక్కే వెళ్లి పోతున్నారు. అంతెందుకు. రాహుల్ గాంధీయే ఆ కుర్చీలో కూర్చునేందుకు ఆసక్తి చూపించటం లేదు. ఇక వేరే నేతలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. 2014 ముందు వరకూ వరుస విజయాలతో దూసుకుపోయిన ఆ పార్టీ...ఇప్పుడు ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సీనియర్ నేతల అలక తీర్చటానికే అధిష్ఠానానికి సమయం చాలటం లేదు. ఇక పార్టీని బలోపేతం చేయటంపై ఎక్కడ దృష్టి పెడుతుంది..? 2019 తరవాత కాంగ్రెస్‌ స్థితిగతులు మరీ దారుణంగా మారిపోయాయని...రాజీనామా చేసిన సమయంలో గులాం నబీ ఆజాద్ అన్నారంటే అందులో నిజం లేకుండా ఉంటుందా? ఇదంతా చూస్తుంటే...ఇప్పుడు కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్ల అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. 


ట్రబుల్‌షూటర్ ప్రణబ్..


ఓ పార్టీ బలపడాలంటే వ్యూహాలు అవసరమే. కానీ...అంతకు ముందు అసలు పార్టీలో ఏం సమస్యలున్నాయో గుర్తించాలిగా. అందుకే.. కాంగ్రెస్‌కు ట్రబుల్‌ షూటర్లు అవసరం అనేది. 2014కు ముందు కాంగ్రెస్‌ వేరు. ఇప్పటి కాంగ్రెస్ వేరు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఆ మధ్య ఇదే మాట అన్నారు. కాంగ్రెస్‌లో ప్రక్షాళణ అవసరమని, అంతర్గత సమస్యలను పరిష్కరించాలని కామెంట్ చేశారు. ఆయనొక్కరే కాదు. చాలా మంది నోట ఇదే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ డౌన్‌ఫాల్ ఎప్పుడు మొదలైంది అంటే...ట్రబుల్‌షూటర్స్‌ని పక్కకు తప్పించటం నుంచే అంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్ ఎవరు అంటే ఠక్కును గుర్తొచ్చే పేరు ప్రణబ్ ముఖర్జీ. ఇందిరా గాంధీ హయాం నుంచే ఆమెకు, పార్టీకి విధేయుడిగా ఉన్నారు ముఖర్జీ. ఎన్నికల ప్రచారాలను, కొన్ని సంక్లిష్ట సమస్యలు ప్రణబ్ డీల్ చేసే తీరు చూసి ఇందిరా గాంధీ ఎంతో మురిసిపోయేవారట. అందుకే...ఆమె ప్రణబ్‌ను ఎంతో ప్రోత్సహించారు. అలా అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా దాదాపు 23 ఏళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలోనే కాంగ్రెస్‌కు వ్యూహకర్తగానూ వ్యవహరించారు. 2004లో అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక బంధాన్ని పెంపొందించటం సహా..2005లో డిఫెన్స్ రిలేషన్స్‌ని బలోపేతం చేయటంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు.


అదొక్కటే కాదు. 2004-12 వరకూ కాంగ్రెస్ తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం వెనక మాస్టర్ మైండ్ ప్రణబ్‌దే. సమస్య వచ్చిన ప్రతిసారీ "ప్రణబ్" ఉన్నారుగా అని కాంగ్రెస్‌ భరోసాగా ఉండేదంటే...ఆయన ప్రాధాన్యత ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ.. రాష్ట్రపతి పదవిని చేపట్టారు. అదిగో అక్కడే మొదలైంది అసలు సమస్య. గాంధీ కుటుంబానికి ఎదురు చెప్పే ధైర్యం అప్పట్లో ఏ నేతలకూ ఉండేది కాదు. ప్రణబ్ ముఖర్జీ మాత్రం నచ్చకపోతే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవారట. ఒక్కోసారి ఆయన కోపాన్ని చూసి సోనియా గాంధీ కాస్త చిరాకు పడేవారని పార్టీ వర్గాలు చెబుతుండేవి. రాహుల్ గాంధీ ప్రణబ్‌ను పక్కన పెట్టారన్న ఆరోపణలూ అప్పట్లో బాగానే వినిపించాయి. కారణమేదైతేనేం...అలాంటి వ్యూహకర్తను, ట్రబుల్ షూటర్‌ని సైడ్‌కి నెట్టి రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టింది అప్పటి యూపీఏ. 


ప్రణబ్‌ను పక్కన పెట్టాకే...


ప్రణబ్ రాష్ట్రపతి పదవిని చేపట్టాక...పార్టీలో జోక్యం తగ్గిపోయింది. రాజకీయాలకు కాస్త దూరమయ్యారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగింది. రాహుల్ గాంధీ తీరుతో కొందరు నేతలు అలిగారు. అందుకే కొందరు కాంగ్రెస్ డౌన్‌ఫాల్‌ అంశం వచ్చినప్పడుల్లా "రాహుల్ గాంధీ ఫ్యాక్టర్" అని ప్రస్తావిస్తుంటారు. ఆయన సీనియర్లకు గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఫలితంగా...కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. దీనికి తోడు నరేంద్ర మోదీ ప్రభంజనం మొదలైంది. ఆయన చరిష్మా...2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓటమి పాలు చేసింది. అప్పటి నుంచి తడబడుతూనే ఉంది కాంగ్రెస్. ప్రణబ్ లాంటి ట్రబుల్‌ షూటర్‌ను పక్కన పెట్టాక...ఆ స్థాయి వ్యక్తి కోసం వెతుకులాట మొదలు పెట్టింది. అప్పుడే కమల్‌నాథ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. సంజయ్ గాంధీ హయాంలోనే యూత్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్‌గా పెట్టుకుంది.


అయితే...ప్రణబ్ ఉన్నప్పుడు..ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈ ఇద్దరూ కలిసి ఎంతో మేధోమథనం చేసి 
పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైతే ప్రణబ్ ప్లేస్‌లో కమల్‌నాథ్ వచ్చారో..మన్మోహన్‌కు రైట్ హ్యాండ్‌ను కోల్పోయినట్టయింది. మధ్యప్రదేశ్‌లో 9 సార్లు ఎంపీగా గెలిచిన కమల్‌నాథ్, ఆ రాష్ట్రంలో జరిగిన భాజపా ఆపరేషన్ లోటస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా...కొన్ని కీలక అంశాల్లో మాత్రం కాస్త తడబడ్డారు. కమల్‌నాథ్ పని తీరుతో...మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసేవారట. ఫలితంగా...ట్రబుల్‌షూటర్‌గా ప్రణబ్ స్థానాన్ని కమల్‌నాథ్ రీప్లేస్ చేయలేకపోయారు. ఆ తరవాత హరీష్ రావత్ ఈ బాధ్యత తీసుకున్నారు. కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్న ఆయన కూడా చివరకు అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఏ పనీ చేయకుండా నా చేతులు కాళ్లు కట్టేశారు" అని అప్పట్లో ఆయన సంచలన కామెంట్స్ కూడా చేశారు. 


తరవాతి ట్రబుల్ షూటర్ ఎవరు? 


ప్రణబ్ తరవాత అహ్మద్ పటేల్‌ చాలా వరకూ కాంగ్రెస్ ట్రబుల్ షూటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. వాటిని అంతే సమర్థంగా మోశారు కూడా. కాంగ్రెస్‌లో పవర్‌ఫుల్ లీడర్స్‌ లిస్ట్‌ని అహ్మద్ పటేల్ పేరు లేకుండా ఊహించుకోలేం. సోనియా గాంధీకి పొలిటికల్ సెక్రటరీగా చాలా కాలం పాటు పని చేశారు. 1997లో సోనియా గాంధీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు సోనియాను గైడ్ చేసింది అహ్మద్ పటేలే. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి..? ఎలాంటి వ్యూహాలతో దూసుకుపోవాలి..? సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి..? ఇలా ప్రతి అంశాన్నీ సోనియాకు వివరించారు. ఆయనను అందరూ "అహ్మద్ భాయ్‌"గా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే వారు. 2004,2009లో కాంగ్రెస్ విజయంసాధించటం వెనక ఉన్నది అహ్మద్ పటేలే అని పార్టీ వర్గాలు ఇప్పటికీ చెబుతూనే ఉంటాయి. సోనియా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా...ముందు అహ్మద్ పటేల్‌తో చర్చించేవారట. "గాంధీ కుటుంబం ఎప్పటికీ గట్టిగానే నిలబడుతుంది" అని చాలా సందర్భాల్లో చెప్పేవారు. 2020లో ఆయన మృతి చెందాక, సోనియా గాంధీ...రాజకీయ పరంగా ఒంటరి అయ్యారు. అప్పటికే రాహుల్ గాంధీతో సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉండగా... అహ్మద్ పటేల్ లోటుతో పార్టీలో అంతర్గత కలహాలు బాగా పెరిగాయి. ఇప్పుడీ సమస్యని పరిష్కరించాలని రాహుల్ ప్రయత్నిస్తున్నా...ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. పటేల్ తరవాత ప్రియాంక గాంధీ ట్రబుల్ షూటింగ్ బాధ్యతలు తీసుకున్నట్టు వినికిడి. అయితే..అధికారికంగా మాత్రం కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఈ మధ్య కాలంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే...ట్రబుల్‌షూటింగ్ పనిలో ఉన్నారని అనుకున్నా...పూర్తి స్థాయిలో ఆమె ఈ పదవికి న్యాయం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. 
 


Also Read: Bandi Sanjay: బండి సంజయ్ యాత్రలో మళ్లీ ఉద్రిక్తత, కర్రలతో కొట్టుకున్న టీఆర్ఎస్ - బీజేపీ నేతలు!