Racist Attack In Texas:
దారుణంగా తిడుతూ..
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో భారతీయుల ప్రాతినిధ్యం తక్కువేమీ కాదు. నైపుణ్యం ఉన్న భారతీయులను ఆయా దేశాల్లోని కంపెనీలు పెద్ద మొత్తంలో ప్యాకేజీలు ఇచ్చి మరీ ఆహ్వానిస్తుంటాయి. ఇంకొందరు ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్తుంటారు. అక్కడే స్థిరపడి ప్రశాంతంగా ఉన్నప్పటికీ..కొన్నిసార్లు వర్ణ వివక్షకు గురవుతుంటారు. భారతీయులంటే గిట్టని కొందరు అమెరికన్లు..దారుణంగా తిట్టడం, ఒక్కోసారి దాడులు చేయటం లాంటివి అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనే అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఓ మెక్సికన్ అమెరికన్ మహిళ...ఇండియన్ అమెరికన్స్‌పై బూతులతో విరుచుకుపడింది. అమెరికాను నాశనం చేస్తున్నారని, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ శివాలెత్తి పోయింది. డల్లాస్‌లోని ఓ పార్కింగ్ ఏరియాలో ఈ గొడవ జరిగింది. "ఇండియన్స్ అంటే నాకు చాలా చిరాకు. లైఫ్ బాగుండాలనే ఆశతో అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు" అని అసహనం వ్యక్తం చేసింది ఆ మహిళ. దాడికి గురైన ఇండియన్ అమెరికన్స్ ఆమె మాట్లాడిందంతా వీడియో తీశారు. ట్విటర్‌లో పోస్ట్ చేశారు...అమెరికాలోని ఇండియన్ అమెరికన్లంతా షాక్ అయ్యారు. ఆ మహిళ తిట్టటంతోనే ఆగలేదు. వీడియో తీస్తుంటే..వద్దంటూ దాడికి పాల్పడింది. మీద పడి కొట్టింది.
అరెస్ట్
"మా అమ్మ, వాళ్ల ముగ్గురు స్నేహితులతో డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది" అంటూ ఓ మహిళ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇలా మాట్లాడకూడదంటూ వీడియో తీసిన మహిళ ఎన్ని సార్లు వారించినా...ఆమె ఊరుకోలేదు. "ఇండియాలో అంతా బాగుంటే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు" అంటూ గట్టిగా అరుస్తూ మీద పడిపోయింది. మరో ట్విస్ట్ ఏంటంటే. వీడియో ఆపకపోతే గన్‌తో కాల్చేస్తానంటూ తన హ్యాండ్‌బ్యాగ్‌లో చేతులు పెట్టి గన్ తీస్తున్నట్టుగా బెదిరించింది కూడా. ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తరవాత ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ కూడా చేశారు. ఆమెను జైల్లో పెట్టామంటూ ఫోటో పెట్టారు.