Crime News :  యూనివర్శిటీ అంటే వందల ఎకరాల స్థలం .. పెద్ద పెద్ద క్యాంపస్‌లు ఉంటాయని మనకందరికీ తెలుసు. కానీ కొంత మంది డబుల్ బెడ్‌రూం అపార్టుమెంట్ ఫ్లాట్లలో కూడా యూనివర్శిటీలు పెట్టేస్తున్నారు. అలా కూడా పెట్టొచ్చా అనే డౌట్ చాలా మందికి రావొచ్చు కానీ.. ఫేక్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అనేదే అసలు లాజిక్. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఫేక్ యూనివర్శఇటీల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఇందులో ఏపీలోనూ ఓ  ఫేక్ యూనివర్శిటీ ఉన్నట్లుగా వెల్లడయింది. దాని పేరు క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్శిటీ. 


క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్శిటీ పేరుతో ఫేక్ విశ్వవిద్యాలయం


క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్శిటీ పేరు చాలా మంది ఎక్కడా విని ఉండరు. అసలు గుంటూరులో ఉన్నవారే విని ఉండరు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గుంటూరు నగరంలోని కాకుమానువారి తోట , శ్రీనగర్ కాలనీల పేర్లతో అడ్రస్‌లు ఇచ్చి ఈ యూనివర్సిటీ నడిపేస్తున్నారు. అక్కడ నాలుగు కుర్చీలు కూడా ఉండవు. అయినా యూనివర్శిటీ పేరుతో నడిపించేస్తున్నారు. కొన్ని క్రైస్తవ మైనారిటీ సంస్థలు ఇలా చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. 


డాక్టరేట్లు ఇస్తామని మోసాలు చేస్తున్న నకిలీ యూనివర్శిటీ


ఈ యూనివర్శిటీ బాగోతం ఎలావెలుగులోకి వచ్చిందంటే... మోసాల వల్లే. ఈ సంస్థ తమది యూనివర్శిటీ అనిచెప్పి డబ్బులకు డాక్టరేట్లు అమ్మేస్తోంది. నకిలీ సర్టిఫికెట్లు అమ్ముకోవడం లాంటివి చేస్తోంది. టీవీల్లో కనిపించే మారుతీ జ్యోతిష్యాలయం స్వామిజీకి ఈ క్రైస్తవ యూనివర్శిటీ డాక్టరేట్ ఇచ్చింది. మరికొంత మందికి ఇచ్చింది.  వీరి వ్యవహారం తేడాగా ఉండటంతో అప్పట్లోనే చాలా మంది సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో విచారణ జరిపి ఫేక్ యూనివర్శిటీగా గుర్తించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 



క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్శిటీ జారీ చేసినవన్నీ నకిలీ సర్టిఫికెట్లే


ఈ యూనివర్శిటీ పేరుతో ఎవైనా సర్టిఫికెట్లు జారీ చేసి ఉన్నా... అమలులో ఉన్నా.. వాటన్నింటినీ ఫేక్‌గా గుర్తిస్తారు. ఈ యూనివర్శిటీ నిర్వాహకులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ యూనివర్శిటీ బారిన పడి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు.  ఏపీలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వర్శిటీలు ఉన్నాయి. కానీ ఇలాంటి ఫేక్ యూనివర్సిటీ వ్యవహారం బయటపడటం కలకలం రేపుతోంది.