Jayashanker Bhupalapalli News: ఆ వృద్ధ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు. అయితే 30 ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తూ... నలుగురు పిల్లల పెళ్లిళ్లు చేసేశారు. ఇక తమను చూసుకునేది కుమారుడే కదా అని ఆస్తితోపాటు వారసత్వం కింద తన కుమారుడికి ఉద్యోగాన్ని అప్పజెప్పాడు. అదే వారి పాలిట శాపంగా మారింది. అన్నీ తీసుకున్న కొడుకు.. అమ్మానాన్నలను పట్టించుకోవడం మానేశాడు. అనారోగ్యంలో ఉన్నా సాయం చేస్తాడన్న ఆశ లేదు. దీనికి తోడు భార్యకు ఇటీవలే గుండె ఆపరేషన్‌కు 10 లక్షలు ఖర్చు కాగా... కుమారుడి చెంతకు వెళ్లారీ దంపతులు. ఆదరించాల్సిన ఆ కుమారుడు కన్నవాళ్లను కొట్టి పంపించాడు. 


అసలేం జరిగిందంటే..?


జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన గందె వెంటకయ్య, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటయ్య 30 ఏళ్ల పాటు సింగరేణిలో పని చేశారు. కుమారుడికి ఉద్యోగం రావాలని, అతడు చక్కగా బతకాలనే ఉద్దేశంతో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకొని తన ఉద్యోగాన్ని కుమారుడు రవికి కట్టబెట్టారు. ప్రస్తుతం రవి భూపాలపల్లిలోని సింగరేణిలో పని చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సంపాదించిన రెండున్నర ఎకరాల భూమిని కూడా కుమారుడికే ఇచ్చారు. తీరా తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చాక కొడకు రవి వారిని పట్టించుకోవడం మానేశాడు. 


అప్పులు కట్టడంతో పాటు సాకమని వెళ్తే.. కొట్టి మరీ పంపించిన కొడుకు


ఇటీవలే లక్ష్మికి గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. తమ దగ్గర ఉన్న డబ్బులతో వైద్యం చేయించుకుందాం అని అనుకున్నారు. కానీ ఈమె వైద్యానికి దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అయింది. భార్యను కాపాడుకోవాలన్న ఆత్రుతతో ఆయన కొంత అప్పులు చేశారు. ఇదే విషయాన్ని కుమారుడికి చెప్పారు. వాటిని తీర్చి తమను సాకాలంటూ కొడుకు గడప తొక్కగా.. ఆదరించాల్సిన కొడుకు వారితో వాదనకు దిగాడు. మీరు చేసిన అప్పులు నేనెందుకు తీర్చాలంటూ గొడవ పడ్డాడు. ఆస్తితోపాటు ఉద్యోగం కూడా ఇచ్చామనే సరికి కోపంతో ఊగిపోయిన కుమారుడు రవి... కన్నవాళ్లపై దాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వారిని ఇంట్లోంచి బయటకు పంపించేశాడు. 


కలెక్టర్ కలిసి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు


ఇక చేసేదేం లేక హన్మకొండ జిల్లా కాజీపేటలో ఉంటున్న కూతురు వద్దకు వచ్చారు ఆ తల్లిదండ్రులు. ఉన్న ఆస్తులను అప్పజెప్పి దిక్కులేని వాళ్లం అయ్యామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తన కుమారుడిలో మార్పు తీసుకొచ్చి. మంచిగా చూసుకునేలా చూడాలని కోరుతూ వృద్ధ దంపతులు సోమవారం కలెక్టరేట్ లో జరిగి ప్రజావాణికి వెళ్లారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ సమస్యకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. అన్నీ చేసిన అమ్మా నాన్నలను పండు వయసులో వదిలేయడం చాలా బాధకరం అని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని అన్నారు. పిల్లలకు ముందు నుంచే తల్లిదండ్రులు, మనుషుల పట్ల ప్రేమాభిమానులు పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు.