విద్యారంగంలో హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్‌కి మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఇలా మ‌రో మ‌ణిమ‌కుటంగా కొన‌సాగుతున్న వ‌రంగ‌ల్‌లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథ‌మిక స్థాయి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న చారిత్రక నేప‌థ్యం క‌లిగి, ఎంద‌రినో అత్యున్నతులుగా తీర్చిదిద్దిన హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ వ‌రంగ‌ల్‌లో గ‌త ఐదేళ్ళుగా అద్దె భ‌వ‌నంలో న‌డుస్తోంది.


ప్రభుత్వానికి అభ్యర్థన పంపిన హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీకి హ‌న్మకొండ జిల్లా ధ‌ర్మసాగ‌ర్ మండ‌లం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎక‌రాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ జీవో నెంబ‌ర్ 93ని జారీ చేసింది. ఈ జీవోని ప్రభుత్వం త‌ర‌పున రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి  ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు చేతుల మీదుగా, రాజ్యస‌భ స‌భ్యుడు సురేశ్‌రెడ్డి స‌మ‌క్షంలో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మన్‌ గుస్తీ జె.నోరియాకు అందించారు. హైద‌రాబాద్‌లో మంత్రుల నివాసంలో  సోమ‌వారం ఈ జీవోను స్వీకరించారు. 


అలాగే, హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ వ‌రంగ‌ల్‌కి రావ‌డానికి స‌హ‌క‌రించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు నోరియా ధన్యవాదాలు తెలిపారు. సాయం చేసిన మంత్రి ఎర్రబెల్లికి, చీఫ్ సెక్రట‌రీ సోమేశ్ కుమార్‌, హ‌న్మకొండ క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతుల‌కు హెచ్‌పీఎస్ స్కూల్ సొసైటీ ఉపాధ్యక్షుడు నోరియా కృత‌జ్ఞత‌లు తెలిపారు.


Also Read: Akkiraju Haragopal: అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..


ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి రావు మాట్లాడుతూ, 1923లో ఏడ‌వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బేగంపేట‌లో 122 ఎక‌రాల‌లో ఇండో సారాసెనిక్ ప‌ద్ధతిలో నిర్మించిన విశాల‌మైన భ‌వ‌నాల‌లో జాగిర్దార్ కాలేజీగా దీన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ‘‘న‌వాబులు, జాగిర్దార్‌లు, ఉన్నత వ‌ర్గాల పిల్లల‌కు విద్యనందించేందుకు ఈ కాలేజీ ప‌ని చేసింది. నిజాం శ‌కం ముగిసిన త‌ర్వాత 1951లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌గా పేరు మార్చి సొసైటీ గ‌వ‌ర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో ప‌ని చేస్తుంది. హైద‌రాబాద్‌లోని బేగంపేట‌, రామాంత‌పూర్, క‌డ‌ప త‌ర్వాత వ‌రంగ‌ల్‌లో మ‌రో బ్రాంచీ నడుస్తోంది. హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌ ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. అలాంటి స్కూలు వ‌రంగ‌ల్ కేంద్రానికి 5 ఏళ్ళ క్రిత‌మే రావ‌డం, దానికి ఈ రోజు స్థలాన్ని కేటాయించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం’’ అని ఎర్రబెల్లి అన్నారు. 


Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ళ, ప్రముఖ క్రికెట్ కమెంటేటర్ హ‌ర్షా భోగ్లే, విప్రో సీఈఓ కురియ‌న్‌, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి, హీరోలు నాగార్జున‌, రామ్ చ‌ర‌ణ్‌, రాణా, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక మంది హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లోనే చదువుకున్నారని మంత్రి వివ‌రించారు. వ‌రంగ‌ల్‌లోనూ త్వర‌లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ ప్రారంభ‌మై మంచి విద్యాబుద్ధులు ఈ ప్రాంత విద్యార్థుల‌కు కూడా అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల‌ని ఆకాంక్షించారు.


Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి


Also Read: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి