Godavari Water Level At Bhadrachalam: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే గోదావరి నదికి భద్రాచలం వద్ద భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక సోమవారం ఉదయం జారీ చేశారు. రెండవ ప్రమాద హెచ్చరిక 48 అండుగుల నీటి మట్టం కాగా, సోమవారం 7 గంటలకు 48.60 అడుగులు, ఉదయం 9 గంటలకు 49.90 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరికను దాటి గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. అనంతరం 50 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తాజాగా నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో భద్రాచలం వద్ద గోదావరికి మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 


తాజాగా 50 అడుగులు దాటిన నీటి మట్టం..


ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి పలు ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద సాయంత్రం 4 గంటలకు గోదావరి వరద ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అత్యవసర సేవలకు కలెక్టర్ కార్యాలయపు కంట్రోల్ రూమ్ 08744-241950, వాట్సప్ నంబర్ 9392929743, ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, వాట్సప్ నంబర్   9392919750, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ 08743232444, వాట్సప్ నంబర్ 6302485393 ద్వారా అత్యవసర సేవలు పొందాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా నేటి ఉదయం నుంచి వరద ప్రవాహం పెరిగిపోతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 12,79,307 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో గోదావరి నదిలో అక్కడి స్నానఘట్టాలు మునిగిపోయాయి. దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


ఈ సందర్భంలో హెచ్చరికలు జారీ చేస్తారు..



మొదటి ప్రమాద హెచ్చరిక: 43.00 అడుగులు
రెండో ప్రమాద హెచ్చరిక : 48.00 అడుగులు
మూడో ప్రమాద హెచ్చరిక: 53.00 అడుగులు


Also Read: MMTS Services Cancelled: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - 3 రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు


తెలంగాణలో నిండుతున్న ప్రాజెక్టులు
ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో చెరువులు వరద నీటితో నిండి అలుగు పోతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, దిగువకు నీరు ప్రవహిస్తోంది. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరు, తాలిపేరు, మూసీ, ముర్రేడు, మున్నేరు వాగులు వర్షం నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ, జగన్నాథపూర్‌, శ్రీపాద ఎల్లంపల్లి, పీపీరావు, కుమురంభీం, మత్తడివాగులు నిండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 


వర్షాల ఎఫెక్ట్.. రెడ్, ఆరెంజ్ అలర్ట్.. 
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి 9 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 12న లేదా 13వ తేదీన ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్,  జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 


Also Read: IMD Rains Alert: ఈ 12 లేదా 13న మరో అల్పపీడనం ముప్పు - 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన