Telangana Crime News: ఈ మధ్య కాలంలో నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు కొందరు టెక్నాలజీ వాడుతుంటే.. మరికొందరు ఆ టెక్నాలజీ ఆధారంగా ఉన్న వనరులు వినియోగించుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు యూ ట్యూబ్‌లో వీడియోలు చూసి నేరాలు చేస్తుంటే.. అదే వీడియోలు చూసి చేసిన నేరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే కాజీపేట రహమత్‌ నగర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య విషయంలోనూ చోటు చేసుకుంది. వృద్ధురాలు కన్నె విజయ(68)ను హత్య చేసిన దుండగుడు యూట్యూబ్‌లో వీడియో చూసి ఆధారాలను చెరిపేసి ప్రయత్నం చేయడం గమనార్హం. 


హత్యను చేధించిన పోలీసులు


తెలంగాణలోని హన్మకొండ జిల్లా పరిధి కాజీపేటలో కొద్దిరోజుల కిందట వృద్ధురాలు కన్నె విజయ(68)ను ఎవరో దుండగులు హత్య చేశారు. హత్య అనంతరం నేరస్తులు ఆధారాలను చెరిపేయడంతో పోలీసులకు ఈ కేసును చేధించడం సవాల్‌గా మారింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని వైపుల నుంచి విచారణ చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. స్థానికంగా కాజీపేటలోని రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కన్నె విజయను గతేడాది డిసెంబరు 15న దుండగులు హత్య చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణ సందర్భంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ సార్ల రాజు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి విజయ కుటుంబ సభ్యులను, కాలనీ వాసులను, వలస కూలీలను విచారించారు. సుమారు 60 వేల ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించారు. ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు. చివరికి హత్యకు గురైన విజయ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆధారంగా విచారణ చేసిన పోలీసులు.. ఆమె హత్య చేసినట్టు గుర్తించారు. కన్నె విజయ కుటుంబ సభ్యురాలిపై సమీపంలో నివాసం ఉంటున్న మహిళ నిందలు వేయడంతో గొడవలు జరిగాయి. ఆమెతోపాటు మరో ఇద్దరితో విజయ ఘర్షణ పడ్డారు. మరుసటి రోజే విజయ హత్యకు గురయ్యారు. నిందలు వేసిన మహిళ తన ఇంట్లోనే వవిజయం తీవ్రంగా కొట్టి చంపి, ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని నీళ్లతో కడిగి హతురాలి ఇంటి ముందు పడేసి కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చేలా చేసినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. 


గొడవలకు హత్య


ఇరుపొరుగు అన్న తరువాత చిన్న చిన్న గొడవలు సహజం. చిన్నపాటి గొడవలకే హత్యకు పాల్పడడం అత్యంత దారుణం. పైపెచ్చు ఆనవాళ్లు దొరకకుండా సదరు మహిళ చేసిన ప్రయత్నాలు గురించి తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ తరహా కేసులను ఎప్పుడూ చూడలేదంటూ పోలీసులు చెబుతుండడం గమనార్హం. ఈ కేసును చేధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎంతో మందిని విచారించారు. కాల్స్‌ డేటాను పరిశీలించారు. ఇంత చేసిన పోలీసులకు ఇంటి దగ్గరలోని వ్యక్తే హత్య చేసినట్టు తేలడంతో పోలీసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.