Kunamneni: భారత కమ్యూనిస్టు పార్టీని కదిలించే శక్తి పోలీసులకు లేదని గత చరిత్ర చెబుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటి సారిగా ఖమ్మంకు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మం గ్రామీణ సీఐ పై నిప్పులు చెరిగారు. ఘాటైన విమర్శలు చేశారు.
'స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నాడు'
ఖమ్మం రూరల్ సీఐ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నాడని, సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని కూనంనేని విమర్శించారు. తమ పార్టీ శ్రేణులపై ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఖమ్మం రూరల్ సీఐకి సిగ్గు, ఎగ్గూ లేదా అని మండిపడ్డారు. సీపీఐ నాయకుడు సురేష్ పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే బెదిరింపులకు పాల్పడతావా.. అంటూ నిప్పులు చెరిగారు. ఇలాగే పిటిషన్ ఇచ్చిన తమ్మినేని కృష్ణయ్యను చంపారని.. ఇప్పుడు మీరు పిటిషన్ ఎందుకు ఇస్తున్నారని ఖమ్మం రూరల్ సీఐ అనడం ఏమిటని బహిరంగంగా కూనంనేని ప్రశ్నించారు. "ఖమ్మం సీఐ.. నువ్వు హత్యలు చేయిస్తావా.. మర్డర్ లను ప్రోత్సహిస్తావా.. ఇప్పుడు సురేష్ ను కూడా చంపిస్తావా. పోలీస్ డ్యూటీ చేస్తే చాలు. రాజకీయాలు చేయడం అవసరమా" అని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.
'మా తడాఖా చూపిస్తాం'
ఒక్క దెబ్బకు వెయ్యి దెబ్బలు వేస్తామని.. కేసులు సీపీఐ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కొత్తేం కాదని కూనంనేని అన్నారు. "ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చెయ్.. మా నాయకులతో జాగ్రత్తగా ప్రవర్తించు. సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. కార్యకర్తల కంట్లో చిన్న నలుసు పడితే.. మా తడాఖా ఏమిటో చూపిస్తాం. మా కార్యకర్తలకు ఏమైనా అయితే నీ వెంట పడతాం. ఎంతో మంది ఐపీఎస్ లను చూశాం" అని అది గుర్తుంచుకుని ఖమ్మం రూరల్ సీఐ జాగ్రత్తగా మసులుకోవాలని కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూరల్ సీఐని ఖమ్మం నుండి పంపించే వరకు వదిలేది లేదన్నారు. ఖమ్మం పోరాటాల గడ్డ అని కమ్యూనిస్టుల ఖిల్లా అని కూనంనేని అన్నారు. ఖమ్మం జిల్లాది నల్ల నేల కాదని, ఖమ్మం నేల త్యాగాల రక్తాలతో తడిచిన నేల అని వ్యాఖ్యానించారు.
'యూనిఫాం విప్పి రాజకీయాలు చేయండి'
ఖమ్మం రూరల్ సీఐ అధికారిగా వ్యవహించాలని.. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే మీ యూనిఫాం విప్పి చేయండని సీపీఐ రాష్ట్ర నాయకుడు భాగం హేమంత రావు సూచించారు. ఎర్ర జెండా ఖమ్మం రూరల్ సీఐ లాంటి ఎంతో మంది అధికారులను చూస్తూ వస్తోందని.. కమ్యూనిస్టులను కనుమరుగు చేయడం మీ పోలీసుల వల్ల కాదన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఈ మధ్యే గెలుపొందారు. పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావులు పోటీ పడ్డారు. ఖమ్మం, హైదరాబాద్ కు చెందిన నేతలు కూనంనేనికి మద్దతుగా నిలిచారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఇటీవల ఎన్నికయ్యారు. పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని సీఐపై కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.