తెలంగాణ కాంగ్రెస్ నేత శివకుమార్‌ రెడ్డికి కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులోని ఓ హోటల్ లో శివకుమార్ రెడ్డి తనపై అత్యాచారం చేశాడంటూ కాంగ్రెస్ మహిళా నాయకురాలు కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి రేప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కోరారు.


దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రేప్ చేసేందుకు ప్రయత్నించాడంటూ  ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022 మే 7న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనూ శివకుమార్ రెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 417, 420,376, 506 కింద కేసులు పెట్టారు. 2020లో తనకు శివకుమార్‌రెడ్డితో పరిచయమైందని 2021 జూన్‌ 24న ఓ హోటల్‌లో తన మెడలో పసుపుతాడు కట్టి, అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న భార్య ఆరోగ్యం బాగాలేద‌ని ఆమె మూడేళ్ల కంటే ఎక్కువ కాలం బ‌త‌క‌ద‌ంటూ నమ్మించాడని మహిళ ఆరోపించారు. బేగంపేట, బెంగళూరులో హోటళ్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు చేశారు. అధికారికంగా పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో శివ‌కుమార్ రెడ్డి త‌న అనుచ‌రుల చేత బెదిరింపుల‌కు దిగాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులు కేసును కొట్టివేశారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివకుమార్ రెడ్డి రేప్ కేసు వ్యవహారం దుమారం రేపుతోంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పీఈసీ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు నిమగ్నమయ్యాయి. ఇలాంటి సమయంలో బెంగళూరు పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.