ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా ఉంటున్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే పార్టీలో ఉంటున్న వీరు ఒకరిపై ఒకరు ఎన్నో సందర్భాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అలా ఉప్పు - నిప్పులా ఉన్న వీరు నేడు (సెప్టెంబరు 4) ఎదురుపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారు. ఆ తర్వాత ఏకంగా ఇద్దరూ కలిసే కూర్చున్నారు. కాసేపటికి రాజయ్యకు ఏమనిపించిందో ఏమో కానీ మధ్యలోనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


ఇటీవలి కాలంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మద్య పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగిన సంగతి తెలిసిందే. వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తనకే ఈసారి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ వస్తుందని రాజయ్య ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పగా, ఆయన ఆశలను గల్లంతు చేస్తూ బీఆర్ఎస్ అధిష్ఠానం కడియం శ్రీహరికి ఈసారి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. 


దీంతో రాజయ్య బహిరంగంగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. అయినా తాను కేసీఆర్ గీసిన గీత దాటబోనని చెప్పారు. తాను ఎప్పటి నుంచో కేసీఆర్ వెంట ఉన్నానని గుర్తు చేసుకున్నారు.