Warangal Politics: అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి పాలన సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికల పోరు రానుండడంతో ఆయా పార్టీల నేతల చూపు ఎంపీ స్థానాలపై పడింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు, సిట్టింగ్ అభ్యర్థులు, ఇతర నేతలు ఎంపీ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. వరంగల్ ఎంపీ స్థానానికి ఆయా పార్టీల నుండి ముగ్గురు, నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒకటి వరంగల్ పార్లమెంటు, రెండు మహబూబాబాద్ పార్లమెంటు. వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ కాగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టి రిజర్వేషన్. వరంగల్ ఎంపీ స్థానం విషయానికి వస్తే 2009  పునర్విభజన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు. 2014లో టీఆర్ ఎస్ నుంచి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. కడియం శ్రీహరి రాజీనామాతో 2015లో జరిగిన బై ఎలక్షన్ తోపాటు 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి పసునూరి దయాకర్ విజయం సాధించారు.


వరంగల్ ఎంపీ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పోలైన ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రధానంగా పోటీపడుతున్నారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ ఉద్యమకారులు అడ్వకేట్ గుడిమల్ల రవికుమార్, విద్యార్థి నాయకునిగా కీలక భూమిక పోషించిన మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ సైతం వరంగల్ ఎంపీ టికెట్ బహిరంగంగానే చెబుతున్నారు. ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన అరూరి రమేష్ ఎంపీ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, స్థానికుడు కావడంతో పాటు పట్టున్న నేత కావడంతో ఎంపీ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


కాంగ్రెస్ నుంచి..
రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తో పాటు దొమ్మాటి సాంబయ్య, వర్ధన్నపేట అసెంబ్లీ టిక్కెట్ ఆశించి బంగపడ్డ నమిండ్ల శ్రీనివాస్ ఎంపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేతున్నారు. అవకాశం ఉన్న ప్రతి చోట టిక్కెట్ నాదే అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్త, మాజీ ఎంపీగా, తెలంగాణ కోసం పోరాడిన నేతగా ప్రజల్లో తనపై నమ్మకం, అభిమానం ఉందని చేయకుంటున్నారు. టిక్కెట్ రేసులో ఉన్న మరో నేత దొమ్మటి సాంబయ్య. ఈయన, రేవంత్ రెడ్డి లో కలిసి పని చేయడం తో పాటు కాంగ్రెస్ లో సైతం రేవంత్ రెడ్డికి సన్నితంగా కొనసాగుతూ వస్తూన్నారు. సాంబయ్య కూడా ఎంపీ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. మరో నేత నమిండ్ల శ్రీనివాస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట టిక్కెట్ వచ్చి నట్టే వచ్చి చేజారడంతో ఎంపీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని సైతం టిక్కెట్ కోసం కలిసి వచ్చినట్లు పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు కాంగ్రెస్ హవా కొనసాగుతుండడంతో విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆశావహులు పట్టు వడలడంలేదు. పార్లమెంటు ఎన్నికల సమయానికి కొత్త ముఖాలు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పవచ్చు.


ఇక సెంట్రల్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుండి సైతం వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ ఉంది. గత ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానానికి పార్టీ అభ్యర్థి లేకపోవడంతో పక్క జిల్లా నుంచి చింత సాంబమూర్తిని తీసుకువచ్చి నిలబెట్టారు. కానీ ఈ సారి పోటీ ఎక్కువగానే ఉంది. బిజెపిలో ఈసారి కొత్త పేరు బాగా వినిపిస్తుంది ఆయనే మందకృష్ణ మాదిగ. ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ బిజెపి అభ్యర్థిగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కాషాయ పార్టీలో చర్చ జరుగుతుంది. మందకృష్ణ మాదిగ ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీకి దగ్గర కావడంతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ మందకృష్ణ మాదిగకు కన్ఫామ్ అయినట్టే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మందకృష్ణ మాదిగ తో పాటు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిద్దరితోపాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేరు సైతం వినిపిస్తుంది. మంద కృష్ణ మాదిగ, కొండేటి శ్రీధర్ పేర్ల కంటే మాజీ ఐపీఎస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆ పార్టీ నేతలు మాకు అభ్యర్థులు కరువా మాకు ఓ ఐపీఎస్ ఉన్నాడని చెప్పుకుంటున్నారు. బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ స్థానిక నేతలకు ఇస్తుందా. లేక 2019 ఎన్నికల్లో మాదిరిగా పక్క జిల్లా నుంచి తెచ్చుకుంటారా వేచి చూడాలి.