జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారిణిపై ఆదివాసీ రైతులు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు రాగా.. అదే సమయంలో పోడు రైతు గిరిజనులు పెట్రోల్‌తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిధిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. తొలుత ఉద్రిక్తత చోటు చేసుకోగా.. అనంతరం అది తీవ్రమై దాడి చేసుకొనే వరకూ వెళ్లింది. పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బాధిత పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడు భూమిలో అటవీ శాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం మొక్కలు నాటేందుకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చి మొక్కలు నాటుతున్న అటవీ అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎవరూ తగ్గకపోవడంతో ఆ గొడవ కాస్తా.. పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఆదివాసీ రైతులు ఓ అటవీ అధికారిణిపై సెట్రోల్ పోసి నిప్పటించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలిని భూపాలపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికారులు తరలించారు. కాగా, ఈ ఘటనపై తోటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.