Telangana Crime News: సాధారణ ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు పోలీసు వ్యవస్థ ఉంది. నేరాలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత పోలీసులది. పోలీసులపై ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడే.. పోలీస్‌ స్టేషన్‌కు దైర్యంగా పోలీసులు వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. పోలీసులపై నమ్మకం సన్నగిల్లితే.. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశను బాధితులు కోల్పోతారు. అటువంటి సమయంలోనే బాధితులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పోలీస్‌ వ్యవస్థలోని కొందరు అధికారులు తీరు ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చేదిగా ఉంటోంది. పోలీసులు బాధితులు పక్షాన కాకుండా.. పెద్దల పక్షాన ఉంటూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకోవడంతోపాటు బాధితుడు పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసి మరీ అద్యశ్యమయ్యాడు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


అప్పు తీర్చమంటే వేధింపులు


తెలంగాణలోని హన్మకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన ప్రశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తి తెలిసిన వాళ్లకు అప్పుడు ఇచ్చాడు. ఆ అప్పు చెల్లించమని అడుగుతుంటే వేధిస్తున్నారని ప్రశాంత్‌ కుమార్‌ హసన్‌పర్తి పోలీసులను ఆశ్రయించాడు. సాధారణంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తికి న్యాయం చేసేందుకు పోలీసులు ప్రయత్నించాలి. కానీ, అందుకు విరుద్ధంగా ఇక్కడ పోలీసులు వ్యవహరించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రశాంత్‌ కుమార్‌ వద్ద నుంచి సీఐ సెల్‌ఫోన్‌, వాచీ లాక్కుని తీవ్రంగా కొట్టాడంటూ ప్రశాంత్‌ కుమార్‌ ఆరోపించాడు. తాను చెప్పిన సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా, వేధింపులకు గురి చేయడంతోపాటు తీవ్రంగా కొట్టినట్టు ప్రశాంత్‌ వాపోయారు.


పోలీసులు చర్యను తీవ్రంగా ఖండిస్తూ జరిగిన మొత్తం వ్యవహారాన్ని నోట్‌లో రాసి అద్యశ్యమయ్యాడు. పోలీసులు దెబ్బలు తాళలేక తన భర్త అదృశ్యమయ్యాడని, పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు తన భర్తను వెతికి అప్పగించాలంటూ ప్రశాంత్‌ కుమార్‌ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రశాంత్‌ కుమార్‌ భార్య శ్యామల సీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రక్షించాల్సిన పోలీసులే.. ఈ మేరకు బాధితులను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 


దారుణంగా కొట్టారంటూ లేఖ


కుటుంబ సభ్యులకు లేఖ రాసి వెళ్లిపోయిన ప్రశాంత్‌ కుమార్‌ పిల్లలను బాగా చదవించాలని, తనను గతంలో కాపాడిన పోలీసులు, వైద్యులు, ఇతర కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెబుతూనే.. హసన్‌పర్తి పోలీసులపై తీవ్ర స్థాయిలో అభియోగాలను మోపాడు. సీఐ, ఎస్‌, మరో ఐదుగురు కానిస్టేబుల్స్‌ స్టేషన్‌లో దారుణంగా కొట్టారంటూ లేఖలో పేర్కొన్నాడు. వీరిని శిక్షిస్తేనే తన ఆత్మ శాంతిస్తుందంటూ లేఖలో పేర్కొన్నాడు. అలాగే, డబ్బులు ఇచ్చిన వ్యక్తికి, పోలీసులతో తాను చేసిన సంభాషణకు సంబంధించిన కీలకమైన అంశాలను లేఖలో రాసి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసులు తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారు. మరోవైపు ప్రశాంత్‌ కుమార్‌ తన భర్తను వెతికి తీసుకురావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.