Hanamkonda BJP Meeting : తెలంగాణలో మరో వివాదం తెరపైకి వచ్చింది.  బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రజా సంగ్రామ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. శుక్రవారం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ పాదయాత్ర ముగింపు సభ భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారని ప్రకటించారు. తాజాగా బీజేపీ బహిరంగ సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ లేఖ రాశారు.  ఆర్ట్స్ కాలేజీలో ముగింపు సభకు ఇచ్చిన అనుమతి రద్దు చేశామన్నారు. కాలేజీ గ్రౌండ్ లో సభ నిర్వహించేందుకు అంతకు ముందు ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చారు. తాజాగా పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అనుమతి రద్దు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలికి ప్రిన్సిపాల్ లేఖ రాశారు. సభ నిర్వహణకు ఇచ్చిన రూ. 5 లక్షలు వాపస్ ఇస్తామని తెలిపారు.  బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది.

  


ఆగిన చోట నుండే పాదయాత్ర  


బండి సంజయ్ పాదయాత్ర ఆగిన చోట నుంచి ప్రారంభం కానుంది. రోజుకు 20 కి.మీలకు పైగా నడిచేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. రేపు ఉదయం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలుకానుంది. స్టేషన్ ఘన్ పూర్ లోని పాంనూర్ కు చేరుకుని, అక్కడే బస చేయనున్నారు.  ఈనెల 27న మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగనుంది. 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ తలపెట్టింది. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు ఫుల్ జోష్ తో ఉన్నారు. రేపటి పాదయాత్రలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని సమాచారం.  బహిరంగ సభ అనుమతి రద్దుపై కోర్టుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు. 


బండి సంజయ్ ఫైర్ 


ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవాలని దొంగ కేసులు పెట్టి దాడులు చేపించి అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం కుట్ర పన్నిందని, చట్టం న్యాయం మీద విశ్వాసంతో కోర్టును ఆశ్రయించామన్నారు.  పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిందని, తీర్పును స్వాగతిస్తామన్నారు. పాదయాత్ర మరలా మెదలుపెడతామన్నారు. 
ప్రభుత్వం దుర్మార్గపు పనులతో బీజేపీని అడ్డుకోలేదన్నారు. ముఖ్యమంత్రి నోటికీ వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు.  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అధికారిక  కార్యక్రమంలో దేశ ప్రధానిపై ఎలా మాట్లాడుతారని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డికి మోడీ శాపంగా మారారని అవాకులు పేలుతున్నారన్నారు. అక్కడ ఎంత మందికి పెన్షన్ ఇచ్చారని, డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చారో చెప్పాలన్నారు.  


దళిత బంధు పేరుతో మోసం 


"డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులపై శ్వేత పత్రం విడుదల చేయగలరా? . దళిత బంధు పేరుతో ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నారు. తెలంగాణ విభజన సమయంలోనే మెట్టమొదటి ద్రోహం చేసింది సీఎం కేసీఆరే. కృష్ణా పరివాహక ప్రాంతం  575 టీఎంసీ లు రావాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రితో కుమ్మక్కై 299 టీఎంసీలకు సంతకం పెట్టారు. రావాల్సిన వాటిపై పోరాడవు వచ్చే వాటిని వాడుకోవు. కేంద్రం నుంచి ముఖ్యమంత్రికి ఎన్నో సార్లు రిప్లై వచ్చింది. అపెక్స్ కౌన్సిల్ లో సమావేశం పెడితే అందులో ఏమి చేసినవ్. సుప్రీంకోర్టు లో కేసు విత్ డ్రా చేసుకోమంటే సంవత్సరం తర్వాత విత్ డ్రా చేసినవ్. అనేక ప్రాంతాలు ఎడారిగా మారాయి అంటే కారణం కేసీఆర్ నే.  ఇన్ని సంవత్సరాలు ఆంధ్రా ముఖ్యమంత్రితో ఎందుకు కుమ్మక్కు అయ్యావు. అభివృద్ధి గురించి ఇచ్చిన హామీల గురించి మాట్లాడు ముఖ్యమంత్రి. రైతుల్లో మంటలు నీవల్లే కాలుతున్నాయి. వరి వేస్తే ఉరే అన్నావ్ దుబ్బాక, హుజురాబాద్ లో దెబ్బ కొట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీపై వేయాలని కేసీఆర్ కుటుంబం చూస్తోంది. లిక్కర్ స్కామ్ వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకుంటున్నారు. "- బండి సంజయ్ 


Also Read : Bandi Sanjay Paadayatra : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి, పోలీసుల నోటీసులు సస్పెండ్