Vanama :  హైకోర్టు అనర్హతా వేటు వేయడంతో పదవిని కాపాడుకునేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారు.  తనపై వేసిన అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు అప్పీల్ కు వెళ్లాడానికి అవకాశం ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు  హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. వనమా పిటీషన్ ను హైకొర్టు విచారణకు స్వీకరించింది.   వనమా వెంకటేశ్వరరావు తరపు లాయర్ వాదనలు విని.. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. పదవి కాలంలో మరో నాలుగు  నెలలు మాత్రమే ఉండటంతో సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ పూర్తయ్యే సరికి పదవి కాలం పూర్తయిపోతుంది. 


మరో వైపు  జలగం వెంకట్రావు.. తీర్పు కాపీతో  సచివాలయానికివచ్చారు. కోర్టు తీర్పును  బట్టి  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని చీఫ్ సెక్రటరీని విజ్ఞప్తి చేశారు.  తర్వాత సీఈవో వికాస్ రాజ్‌నూ కలిశారు. తనను ఎమ్మెల్యేగా నియమించాలని కోరారు.  వనమా వెంకటేశ్వరరావుపై 2019 లో హై కోర్టులో పిటిషన్ వేశానని  వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని జలగం వెంకట్రావుచెబుతున్నారు. తనను ఎమ్మేల్యేగా కోర్టు పరిగణించింది. వనమా వెంకటేశ్వర రావును డిస్ క్యాలిఫై చేసింని గుర్తు చేశారు. ఇది నైతిక విజయమని.. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానన్నారు.  స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడాననని.. చెప్పారు. స్పీకర్ ఎలా స్పందించారో చెప్పలేదు.  2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు అన్ని చూశామని..  చివరికి తనదే విజయమన్నారు. ఎమ్మేల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం కు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని చెప్పుకొచ్చారు.                                                 


ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ... రెండో స్థానంలో ఉన్న వారిని విజేతగా ప్రకటించడం అనేది ఉండదని..కావాలంటే ఉపఎన్నికలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ గతంలో ఏపీలో ఓ ఎమ్మెల్యే ఇలాగే పదవిని కోల్పోయారు. రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అప్పట్లో  స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆ అభ్యర్థితో ప్రమాణం కూడా చేయించారు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తనతో వెంటనే ప్రమాణం చేయించాలని జలగం వెంకట్రావు  పట్టుబడుతున్నారు.  అవసరమైతేచీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కలుస్తానని అంటున్నారు.                       


జలగంతో  ప్రమాణస్వకారం చేయిస్తే వనమా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే జలగం న్యాయపోరాటం చేస్తారు. పార్టీ పైనా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీఆర్ఎస్  హైకమాండ్‌కు ఇబ్బందికరమే. అందుకే న్యాయస్థానాల తీర్పును బట్టి వెళ్లాలని అనుకుంటున్నారు.