కేంద్రంపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు అవిశ్వాస అస్త్రంతో యుద్ధం పునఃప్రారంభించింది. మూడు నెలల క్రితం వరకు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే కేసీఆర్‌ ఈ మధ్య సైలెంట్‌ అయిపోయారు. అప్పుడప్పుడూ కేటీఆర్‌ సహా ఇతర మంత్రులు మాట్లాడటమే తప్ప పెద్దగా ఎదురు దాడి చేసింది లేదు. 


దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్‌ ఆ రెండు పార్టీలపై విమర్శల స్వరాన్ని పెంచింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ గట్టిగానే ప్రచారం చేశాయి. దీనికి బీజేపీ అధ్యక్షుడి మార్పును కూడా ప్రస్తావించింది. అయితే వాటిని ఖండించేలా జరుగుతున్న ప్రచారాన్ని తప్పు పట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్ చేసింది. 


మణిపూర్‌లో జరుగుతున్న హింసపై ఇండియాలోని పక్షాలు ఏకమై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. వాటితో కలిస్తే మళ్లీ విమర్శలు వస్తాయని వేరుగా అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్‌ఎస్. రెండు కూటములకు దూరంగా ఉంటున్న బీఆర్‌ఎస్ తీసుకున్న ఈ స్టెప్‌  రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. 






లోక్‌ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల అంశం ప్రజల్లో చర్చకు వస్తుందని బీఆర్‌ఎస్ చెబుతోంది. అదే టైంలో బీజేపీకి అనుకూలమంటూ తెలంగాణలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టినట్టు అవుతుందని పార్టీ అంచనాగా చెబుతున్నారు. మొత్తానికి ఒక నిర్ణయంతో మూడు ప్రయోజనాలు అన్నట్టు ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్. 


బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు బుధవారం ఉదయం స్పీకర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.  బీఆర్‌ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం కూడా మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంతకం కూడా చేశారు. కాంగ్రెస్‌ తీర్మానంతో తమకు సంబందం లేదంటున్నారు బీఆర్‌ఎస్ ఎంపీలు. తాము విడిగా అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టామని చెబుతున్నారు. కచ్చితంగా ఈ నోటీసుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు.