Ministers Sub Committee about White Ration Cards in Telangana | హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ ఒక్క తెల్ల రేషన్ కార్డు జారీ చేయలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెల్లరేషన్ కార్డులపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రేషన్‌ కార్డుల పంపిణీకి అవసరమైన విధివిధానాలపై మంత్రులు చైర్మన్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహాలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. అనంతరం తెల్లరేషన్ కార్డుల పంపిణీకి అర్హతలపై కీలక ప్రకటన చేశారు. 


ప్రాథమికంగా కేబినెట్ సమ్ కమిటీ నిర్ణయాలివే.. 


రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ‘పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రూ.2 లక్షల గరిష్ట వార్షికాదాయం ఉన్న వారిని రేషన్ కార్డులకు అర్హులుగా భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయల వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక (మెట్టభూమి) 7.5 ఎకరాల లోపు ఉన్నవారినే ఎంపిక చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల మంజూరుకు సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటాం. తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. మరో 10 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసి తెల్ల రేషన్ కార్డులకు అర్హతలను ప్రకటిస్తామని’ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాయనున్న ప్రభుత్వం


తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి సక్సేనా కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. అయితే అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని కేబినెట్ సబ్ కేమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో రేషన్‌ కార్డులున్న వారికి ఆప్షన్‌ ఇవ్వాలని మంత్రుల సబ్ కమిటీ భావిస్తోంది. తెలంగాణలో పలు పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డు ఉండటమే తప్పనిసరి కాదని, అది కేవలం గుర్తింపు కోసమే, నిర్ధారణ కోసమే అని పలు పథకాల అమల్లో భాగంగా మంత్రులు చెబుతున్నారు. 


Also Read: Hyderabad: రాజేంద్రనగర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత, ఎంఐఎం ఎమ్మెల్యే అరెస్ట్ - పీఎస్ కు తరలింపు