కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. సెప్టెంబర్ 13న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ తో సమావేశం కానుంది. నోటిఫికేషన్ అమలు తేదీని వాయిదా వేయాలని.. రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ సమావేశంలో బోర్డు పరిధిని అక్టోబర్ నెల 14 నుంచి అమలు చేయడంపై ఛైర్మన్ల అభిప్రాయాలు, గెజిట్ విడుదలపై ఏపీ, తెలంగాణ అభ్యంతరాలపై చర్చించనున్నారు.
ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై పెత్తనానికే పరిమితం కావాలన్న ఏపీ వాదన, ఆయా ప్రాజెక్టులను అకస్మాత్తుగా బోర్డుల పరిధిలోకి తీసుకుంటే.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలకు చెరో రూ.200 కోట్లు చొప్పున రూ.400 కోట్ల భారం భరించడం కష్టమంటూ తెలంగాణ నిరాసక్తతపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. కృష్ణా, గోదావరి పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్ జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని తెలిపింది. లేకుంటే నిలిపివేయాలని కూడా చెప్పింది.
కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులపై ఏపీ లేఖ రాయడం.. సీఎం కేసీఆర్ ఈ నెల 6న కేంద్ర జల్ శక్తి మంత్రిని కలిసి అంశాలపై పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం బోర్డు ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. శ్రీశైలం జలాశయాన్ని పూర్తిగా విద్యుదుత్పత్తి కోసమే వినియోగించాలని తెలంగాణ చేస్తున్న వాదన కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలతో సోమవారం నిర్వహించే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపైనా కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష చేయనుంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తికావడంతో ముంపు ప్రాంతాల్లోకి గోదావరి జలాలు చేరుతున్నాయి. నష్ట పరిహారం చెల్లించకుండానే.. నిర్వాసితులను తరలిస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ జరిపి కేంద్రానికి నివేదిక అందించింది.
Also Read: Elon Musk: ముందు 'మేక్ ఇన్ ఇండియా'.. తర్వాత పన్ను రాయితీ.. ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన కేంద్రం