Amit Shah gives Counter to Mallikarjun Kharge:
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీగా పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే విపక్ష పార్టీల నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే వికారాబాద్ జిల్లాలో చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ గడ్డ మీదనే కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఖర్గే అంటున్నారని.. కానీ కేసీఆర్, ఒవైసీ ఒకటి అని.. వీరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస - బీజేపీ భరోసా సభలో అమిత్ షా కాంగ్రెస్ అధ్యక్షుడికి కౌంటరిచ్చారు. బీజేపీ ఎన్నటికీ బీఆర్ఎస్ తో గానీ, ఒవైసీ పార్టీ ఎంఐఎంతో కలవదన్నారు. ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటిది బీఆర్ఎస్, ఎంఐఎంలతో కలిసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామన్న ఖర్గే, కాంగ్రెస్ ఆలోచన అర్థరహితం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు ఇచ్చిందో తెలుసా అంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 లక్షల కోట్ల నిధులు ఇవ్వగా.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్క తెలంగాణకే 2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో మోదీ సర్కార్ 33 లక్షల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించింది. 1.90 లక్షల మంది పేదలకు నెలకు 5కిలోల ఉచిత రేషన్ ఇస్తున్నామని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో 11 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చామన్నారు. మరోవైపు 2.5 లక్షల మంది పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మోదీ సర్కార్ సొంతమన్నారు. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, రైతు వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పెకిలించి వేయాలంటూ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. కేసీఆర్ ను ఇంటికి పంపి, బీజేపీని అధికారం లోకి తీసుకొద్దాం అన్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తెలంగాణకు 9 వేల 28 కోట్లు బదిలీ చేయగా, 39.50 లక్షల రాష్ట్ర రైతులకు లబ్ది చేకూరింది. అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి 2,76,116 (2 లక్షల 76 వేల 116 మంది) రైతులు లబ్ది పొందగా.. అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి 28,492 (28 వేల 4 వందల 92 మంది) రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ది చేకూరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు మల్లికార్జున ఖర్గే. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేపీతో పాటు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అయితే కాంగ్రెస్ నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని మోదీ సర్కార్ అమ్మేస్తోందని ఆరోపించారు. మతతత్వ బీజేపీని గద్దె దించడానికి రాజకీయ శక్తులన్ని ఏకం అవుతున్నాయని చెప్పారు. కర్ణాటకలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని ప్రకటించారు.