Crop Loan Waiver in Telangana | ఖమ్మం: గతంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పులరాష్ట్రంగా మారినా, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల రైతు ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు. వివరాలు సరిగ్గా నమోదు కాని రైతులు, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో వివరాలు తప్పుగా ఉన్న అన్నదాతలకు రుణమాఫీ తాత్కాలికంగా నిలిచిపోయిందన్నారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని క్లారిటీ ఇచ్చారు. అర్హులైన రైతులు అందరికీ రుణమాఫీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివరాలు సరిదిద్ది రైతులందరికీ రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 


రుణమాఫీపై ఆందోళన చెందవద్దు


ఖమ్మంలో బుధవారం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ కాని రైతులు ఆందోళన చెందవద్దని, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. మండల ఆఫీసుల్లో, రైతు వేదికలు వద్ద అధికారులను ఉంచి, రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు సైతం నేడు అన్నదాతల కోసం మొసలి కన్నీరు కారుస్తోందని, వారి మాయమాటలు నమ్మవద్దని సూచించారు. 


ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..


కేవలం రూ.1 లక్ష రుణాలను ఐదేళ్లు, ఆ తరువాత మాఫీ చేసిన బీఆర్ఎస్ నేతలు నేడు రైతుల కోసం ఉద్యమాలు చేస్తామనడం హాస్యాస్పందంగా ఉందన్నారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో మూడు విడుతలుగా ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకర్లు చెప్పారని, బకాయిలు రూ.31 వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. వివరాలు సరిగ్గా ఉన్న రైతులకు ఇదివరకే రుణమాఫీ జరిగిందని, తప్పులున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకుని రుణమాఫీని పొందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపిన విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలన్నారు.


Also Read: Hyderabad ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణకు ఆదేశాలు, అలైన్‌మెంట్‌లో మార్పుల‌కు రేవంత్ రెడ్డి సూచన