Jharkhand ex-CM Champai Soren announces to float a new political party : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపైయి సోరెన్ కొత్త పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతగా ఉన్న ఆయన  .. హేమంత్ సోరెన్ ను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. హేమంత్ సోరెన్ కు  బెయిల్ వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. మళ్హీ హేమంత్ సోరెన్ సీఎం అయ్యారు. అయితే తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని ఆయన గత వారం రోజులుగా అలజడి రేపుతున్నారు. బీజేపీతో చర్చలు జరిపారని ఆ పార్టీలో తన మద్దతుదారులతో కలిసి చేరిపోవడమే మిగిలిందని అనుకున్నారు. ఆయనతో ఐదారుగురు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


బీజేపీలో చేరడం కన్నా సొంత పార్టీ ఏర్పాటుకే మాజీ సీఎం నిర్ణయం 


అయితే చంపైయి సోరెన్ మాత్రం  తన ముందు మూడు దారులు ఉన్నాయని ప్రకటించారు. రిటైర్మెంట్ కావడం .. కొత్త పార్టీని  ఏర్పాటు చేసుకోవడం.. పొత్తులుపెట్టుకోవడం అని  చెప్పుకొచ్చారు. రిటైర్మెంట్ అయ్యే అవకాశం లేదని.. రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టకుంటానని స్పష్టం చేశారు. తనతో కలసి వచ్చే వాళ్లు రావొచ్చన్నారు. జార్ఖండ్‌లో వచ్చే నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా ఎంత మంది ఎమ్మెల్యేలను  చంపైయి సోరెన్ ఆకర్షించినా ప్రస్తుతానికి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని భావిస్తున్నారు. చంపైయి సోరెన్ తిరుగుబాటుతో.. జార్ఖండ్ ముక్తి మోర్చా చీలుతుందా.. సమైక్యంగా  హేమంత్ సోరెన్ వైపే ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


జేఎంఎం ఓట్లు చీల్చే వ్యూహమా ?                


జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జేఎంఎం పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమం ద్వారా అనుకున్నది సాధించింది. హేమంత్ సోరెన్ తండ్రి షిబూసోరెన్ ఉద్యమాన్ని  నడించారు. ఆయన వయసు కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకుని హేమంత్ సోరెన్ జార్ఖండ్‌లో కీలక నేతగా ఎదిగారు. మొదటి నుంచి జేఎంఎం కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఉంది. ఇప్పటికీ యూపీఏలో భాగస్వామినే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అక్కడ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టదలతో జేఎంఎం కీలక నేతలను ఆకర్షిస్తోంది. 


నవంబర్‌లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు                                   


మాజీ ముఖ్యమంత్రి అయిన చంపైయి సోరెన్ ను పార్టీలో చేర్చుకోవడం కన్నా.. ఆయనతో సొంత పార్టీ  పెట్టించి.. పోటీ చేయించడం వల్ల.. జేఎంఎం ఓట్లు చీలిపోతాయని దాని వల్లనే ఎక్కువ బీజేపీకి లాభం కలుగుతుదంని బీజేపీ వ్యూహకర్తలు అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయనను పార్టీలో చేర్చుకోవడం కన్నా.. సొంత పార్టీ వైపు ప్రోత్సహించారని అంటున్నారు.