TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే అందరినీ ఆరా తీస్తూ ముందుకు వెళ్తున్నారు. కీలక వ్యక్తులను విచారించేందుకు కూడా అధికారులు ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈ క్రమంలోనే ఛైర్మన్, సెక్రటరీ సహా బోర్డు సభ్యులకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ కు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం ఏప్రిల్ రెండో తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పింది. బోర్డు సభ్యుడు లింగారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని కూడా విచారించనుంది. అలాగే ప్రధాన నిందితుల్లో ప్రవీణ్ ప్రస్తుతం అనితా రామచంద్రన్ కు పీఎగా వ్యవహరిస్తున్నాడు. బోర్డు సభ్యుడు లింగారెడ్డికి రమేశ్ పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నారు. అలాగే బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కరమ రవిందర్ రెడ్డి, ఆర్ సత్యనారయణ, రమావత్ ధన్ సింగ్, కోట్ల అరుణ కుమారి లను సిట్ విచారించనుంది.
ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీక్
అయితే ఇప్పటికే ప్రవీణ్, రమేష్ లను అరెస్ట్ చేసిన సిట్ మరో నిందితుడు షమీమ్ తో కలిపి మూడ్రోజులుగా విచారిస్తోంది. మూడో రోజు కస్టడీ ముగియగా.. కింగ్ కోఠి ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 15కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరింది. లీకేజీ విషయం టీఎస్‌పీఎస్సీలో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు తెలుసన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించిన నలుగురు నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. వారిని విచారించిన క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసినట్లు సమాచారం. పేపర్‌ను కొన్న వారంతా అప్పులు చేసి, ఆస్తులు కుదువ పెట్టి.. రేణుక భర్త ఢాక్యా నాయక్, ఆమె తమ్ముడు రాజేశ్వర్‌కు డబ్బులిచ్చామని చెప్పినట్లు తెలిసింది.
ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
మరో వైపు ఈ పేపర్ల లీకేజీ కేసులో సిట్ ఎటూ తేల్చడం లేదని.. నిందితుల్ని కాపాడేందుకే ప్రయత్నిస్తోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కోర్టుకు నివేదిక సమర్పించక ముందే కేటీఆర్‌కు ఎలా వివరాలు తెలుస్తున్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అయితే తమ నివేదికను నేరుగా కోర్టుకే సమర్పిస్తామని .. ఎవరికీ లీక్ చేయలేదని సిట్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి ఈడీ ఆఫీసుకు వెళ్లారు. బండి సంజయ్‌కు జారీ చేసిన నోటీసుల అంశంపై సిట్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. రెండు సార్లు నోటీసులు జారీ చేసినా బండి సంజయ్ విచారణకు హాజరు కాలేదు.