అసలే నిమిషం నిబంధన.. ఆపై టైమ్ కు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లకపోతే పరీక్ష రాయలేకపోతానని కంగారుపడ్డాడు విద్యార్థి. గూగుల్ మ్యాప్స్ ఫాలో అయి సెంటర్ టైమ్ కు వెళ్దామనుకున్న విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ తప్పుగా చూపించడంతో అక్కడి వెళ్లి చూసిన విద్యార్థి కంగుతిన్నాడు. కరెక్ట్ సెంటర్ కు వెళ్లినా అప్పటికే ఆలస్యమైంది. తొలి రోజు పరీక్ష రాయలేక బాధతో వెనుదిరిగాడు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


అసలేం జరిగిందంటే.. 
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. మార్చి 15న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 4తో ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం కొండాపురం గ్రామానికి చెందిన వినయ్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభం కావడంతో ఎగ్జామ్‌ సెంటర్ కు వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ను ఫాలో అయ్యాడు. గతంలోనూ గూగుల్ మ్యాప్స్ వాడానని ఆ డైరెక్షన్ లో వెళ్లాడు. కానీ తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కు కాకుండా వేరే చోటుకు చేరుకున్నాడు వినయ్. గూగుల్ మ్యాప్స్ తనను వేరే ఏరియాకు తీసుకెళ్లిందని గ్రహించాడు విద్యార్థి.


అసలే నిమిషం ఆలస్యమైతే ఎగ్జామ్ సెంటర్ లోకి నో ఎంట్రీ. నిబంధన గుర్తుకువచ్చి తాను ఎగ్జామ్ రాయాల్సిన సెంటర్ కు ఇంటర్ విద్యార్థి నవీన్ హడావుడిగా బయలుదేరాడు. అడ్రస్ కనుక్కుంటూ అతికష్టమ్మీద సెంటర్ కు చేరుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. దాదాపు 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్ కు వచ్చిన వినయ్ ను అధికారులు సెంటర్ లోకి అనుమతించలేదు. దాంతో ఎగ్జామ్ రాయకుండానే ఇంటర్ విద్యార్థి బాధగా ఇంటి దారి పట్టాడు. కొన్ని సెంటర్లలో విద్యార్థులు నిమిషం నిబంధనతో నష్టపోగా, ఖమ్మంలో వినయ్ అనే విద్యార్థి మాత్రం గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లి ఎగ్జామ్ రాయలేకపోయాడు.


తెలంగాణలో 9.47 లక్షల మంది విద్యార్థులు..
➥ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెకండ్ ఇయర్ వాళ్లు 4,65,022 మంది. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కలుపుకుని 614, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు 859 ఉన్నాయి. 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు , 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్‌ స్క్వాడ్లను ఇంటర్‌ బోర్డు నియమించింది.


➥ ఇంటర్‌లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్‌లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్‌లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్‌ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.