TS Govt On VROs : వీఆర్వోలపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొత్త పోస్టుల్లో చేరేందుకు నిరాకరిస్తున్న వీఆర్వోలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. చట్ట ప్రకారం వీఆర్వోపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలనుకుంటే నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. వీఆర్వోలకు సంబంధించిన అంశంపై అధికారులు గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇతర శాఖల్లోకి వీఆర్వోల బదలాయింపు పూర్తయిందని అధికారులు తెలిపారు. 98 శాతం మంది కొత్త పోస్టుల్లో చేరినట్టు స్పష్టం చేశారు.  


కేటాయించిన శాఖాల్లో చేరాల్సిందే 


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,137 వీఆర్వోల్లో  5,014 మంది తమకు కేటాయించిన శాఖల్లో చేరినట్టు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 121ను సవాల్‌ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. 19 మంది విషయంలో స్టేటస్ కో పాటించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ 19 మందిలో దాదాపు 15 మంది తమకు కేటాయించిన శాఖల్లో చేరినట్టు తెలుస్తోంది. వీఆర్వోలను రెవెన్యూశాఖలో కొనసాగించే ప్రసక్తే లేదని వారికి కేటాయించిన శాఖల్లో తప్పనిసరిగా చేరాల్సిందేనని ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు మరోసారి స్పష్టం చేశారు. 


జీవో 121ను సవరించాలి- వీఆర్వోలు 


వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయించడంపై పలువురు ఆందోళన బాటపట్టారు. జీవో 121 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీనియారిటీ కోల్పోతున్నామని వీఆర్వోలు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను వీఆర్వోలు ముట్టడించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 274 మంది వీఆర్వోలను 40 శాఖల్లో అధికారులు సర్దుబాటు చేశారు. లాటరీ విధానంలో పోస్టింగులు కేటాయించారు. ఈ విధానాన్ని కొంత మంది వీఆర్వోలు నిరాకరించారు. సర్వీస్‌, ప్రమోషన్లను కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం 23 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగదా వ్యవహరించిందని వీఆర్వో సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీవో 121 ను సవరించి శాఖలు కేటాయిస్తేనే విధుల్లో చేరతామని, లేదంటే చేరమని వీఆర్వోలు స్పష్టం చేస్తున్నారు. లేకుండా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. 


Also Read : Minister KTR : దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక విధానాలు, కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్


Also Read : Rajagopal Reddy : జైలుకెళ్లొచ్చిన రేవంత్ కింద పని చేయలేను - సోనియాకు రాజగోపాల్ రెడ్డి లేఖ !