Rajagopal Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ పంపారు. తన రాజీనామాకు కారణం టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డేనన్నారు. రాజీనామాకు దారితీసిన పరిణామాలను రాజగోపాల్ రెడ్డి లేఖలో తెలిపారు. 30ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానన్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీకి విధేయులైన వారిని రేవంత్ అవమానిస్తున్నారు !
లేఖలో రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారని ఆయన ఆరోపించారు. మీ పైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని... ఇది తనను తీవ్రంగా బాధించిందని రాజగోపాల్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని సోనియాకు లేఖలో రాజగోపాల్ గుర్తు చేశారు. కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానన్నారు.
కేసీఆర్‌పై పోరాటానికి కాంగ్రెస్‌కు రాజీనామా
అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేశారని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని .. దీనిని తక్షణం ఆమోదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.
ఎనిమిదో తేదీన స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనున్న కోమటిరెడ్డి
మరో వైపు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు స్పీకర్ ను అపాయింట్‌మెంట్ అడిగారు. ఈ మేరకు ఈ నెల 8న రాజగోపాల్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు స్పీకర్. ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. సోమవారం అధికారికంగా స్పీకర్ ను కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. స్పీకర్ ఆమోదించిన ఆరు నెలల్లోపు ఉపఎన్నికలు జరగనున్నాయి.
రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీని వీడటానికి కారణం రేవంత్ రెడ్డేనని రెండు రోజుల కిందట నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. ఇప్పుడు అదే కారణాన్ని వివరిస్తూ సోనియాకూ లేఖ రాశారు.