Khammam Pidugu : కొన్ని కొన్ని సార్లు రాజకీయనేతలు చెప్పేమాటలు ఆసక్తికరంగానూ ..టెన్షన్ క్రియేట్ చేసేవిగానూ ఉంటాయి. ఇప్పుడలానే టీఆర్ ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏ క్షణానైనా పిడుగు పడవచ్చు సిద్ధంగా ఉండండి అని కార్యకర్తలు, అభిమానులకు ఆయన చెప్పిన మాటలపై రాజకీయవర్గాల్లో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కొంత కాలంగా టీఆర్ఎస్‌తో అంటీ ముట్టకుండా తుమ్మల !
పార్టీలో ఉంటున్న మాటే కానీ గతకొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ ఎస్ వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్సెస్ తుమ్మల వార్ ఖమ్మం జిల్లా నేతలకే కాదు కెసిఆర్-కెటిఆర్ లకు కూడా తెలుసు. ఈ ఇద్దరు నేతల వర్గపోరుతో ఖమ్మంలో కారు పరిస్థితి కష్టంగా మారుతోందని కార్యకర్తల నుంచి కూడా హైకమాండ్‌కు ఫీడ్ బ్యాక్ కూడా అందింది. ఈ మధ్యన ఖమ్మంజిల్లా బస్టాండ్ ను ప్రారంభించేందుకు ఖమ్మం వ్చచిన కెటిఆర్ స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు కూడా జరిపారు. అయినా కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
కేసీఆర్ పర్యటనలో కీలకంగా కనిపించిన తుమ్మల !
అయితే భద్రాచలం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన కెసిఆర్… తుమ్మలతోనే ఎక్కువగా కనిపించడంతో సమస్యలు సమసిపోయాయని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తుమ్మల పిడుగులాంటి మాటలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం రాష్ట్ర బీజేపీ నేతల ప్రకటనలే అని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీఠంపై బీజేపీ కూర్చోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆపార్టీ నేతలు ముందస్తు ప్రచారాలు, యాత్రలతో ప్రజల మధ్యనే గడుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు సవాల్ కూడా విసిరారు. ఎక్కడుంది బీజేపీ తెలంగాణలో అని ఎద్దేవా చేసిన టీఆర్ ఎస్ పార్టీ నేతలు, కెసిఆర్ కి దిమ్మతిరిగేలా నల్గొండ, ఖమ్మంజిల్లాల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అన్నవిధంగానే ఇప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటైన నల్గొండజిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఆపార్టీకి రాజీనామా చేయించారు. మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపారు.
తుమ్మలను బీజేపీ ఆకర్షించే పనిలో పడిందా ?
ఇప్పుడలానే ఖమ్మంజిల్లాలో పట్టున్న తుమ్మలని ఆకర్షించేందుకు బీజేపీ రెడీ అవుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు పువ్వాడతో పొసగని తుమ్మలకి కాషాయం కప్పేందుకు ఉత్సాహంతో ఉంది. తుమ్మల కూడా టీఆర్ ఎస్ ని వీడే క్రమంలోనే పిడుగులాంటి వార్త రావచ్చన్న మాట కార్యకర్తలకు చెప్పారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తుమ్మలని వదులుకునే సాహసం కెసిఆర్ చేయరని అలాగే ఆయన కూడా టీఆర్ ఎస్ ని వదిలి కమలం గూటికి చేరే అవకాశాలు లేవని చెబుతున్నారు. టిడిపి నుంచి టిఆర్ ఎస్ కి వచ్చిన తుమ్మల ఒకవేళ కారు దిగి కాషాయం కప్పుకుంటే బీజేపీ చెప్పిన మాటలు నిజం కాకతప్పదంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో టీఆర్ ఎస్, బీజేపీలకు పట్టులేదు. కాంగ్రెస్ బలంగా ఉన్నా అంతర్గత కుమ్ములాటలతో పట్టుకోల్పోతోంది. దీంతో అవకాశంగా తీసుకుంటోన్న బీజేపీ అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ ఎస్ కి చెక్ పెడుతూ తెలంగాణలో బలం పుంజుకోవాలనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గోల్కోండపై కాషాయం జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతోంది.