AP Highcourt : ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంలో ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని హోంశాఖ పార్లమెంటులో స్పష్టం చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ హైకోర్టు ధర్మాసనం ఓ అంగీకారానికి వచ్చిన తర్వాతే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని  రాతపూర్వక సమాధానంలో  తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని తెలిపింది. టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా మంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు అడిగినప్పుడు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. 


మూడు రాజధానుల విధానంలో భాగంగా కర్నూలుకు న్యాయరాజధాని


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన ధర్మాసనం విభజన చట్టం ప్రకారం అమరావతిలో ఏర్పాటైందని, 2019 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.  ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు నగరానికి తరలించడానికి ఏపీ ముఖ్యమంత్రి 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగా కర్నూాలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే అందు కోసం చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో నిలువలేదు. దీంతో హైకోర్టు తరలింపు కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేకపోయారు. 


ఏపీ హైకోర్టుతో సంప్రదించి రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలి !


రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  హైకోర్టు నిర్వహణ వ్యయం భరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.  అదే సమయంలో హైకోర్టు రోజువారీ పరిపాలనా వ్యవహారాల నిర్వహణ బాధ్యత సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూస్తారు కాబట్టి   ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో పనిచేసే ధర్మాసనాన్ని కర్నూలు తరలించాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులు ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్రానికి వాటిని పంపాల్సి ఉంటుంది. ఈ దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 


హైకోర్టును తరలించాలటే చట్టం అవసరం లేదు !


ఏపీ హైకోర్టును కర్నూలు తరలించాలని కొన్ని పార్టీలు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నాయి. అయితే హైకోర్టు కర్నూలులో పెట్టడం వల్ల నాలుగు జిరాక్స్ షాపులకు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని కొంత మంది వాదిస్తున్నారు. అియతే అసలు ప్రభుత్వం  తీసుకొచ్చిన చట్టమే కోర్టులో నిలవకపోవడంతో హైకోర్టు తరలింపు సాధ్యం కాలేదు. నిజానికి హైకోర్టు తరలించాలటే చట్టం అవసరం లేదు కేంద్రం చెప్పిన దాని ప్రకారం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి .. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్లవచ్చు.