TS bPass :టీఎస్ బీపాస్ అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన టీఎస్ బీపాస్ అమల్లో 39 మంది అధికారులు నిర్లక్ష్యం వహించారని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఫైన్ విధించింది.  వీరిలో  ఆరుగురు హెచ్ఎండీఏ అధికారులు, ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్ బీపాస్ అప్లికేషన్ల పరిశీలన పరిష్కారంలో కొంత మంది అధికారులు తీవ్ర జాప్యం చేశారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  


ఇప్పటి వరకూ 56 మందిపై ఫైన్ 


హెచ్ఎండీఏలో పనిచేసే ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు పలు జిల్లాల్లో 33 మంది అధికారులకు కలెక్టర్లు ఫైన్  విధించారు. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులకు జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020లో టీఎస్ బీపాస్ అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 56 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించింది. టీఎస్ బీపాస్ అమలు తీరుపై తరచూ సమీక్షలు నిర్వహించాలని  కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


టీఎస్‌ బీ పాస్‌ సేవలు


భవన అనుమతులు, భూమి వినియోగ ధ్రువ పత్రాలు, టీడీఆర్‌ బ్యాంక్‌, లే అవుట్‌, భూ వినియోగ మార్పు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఎన్‌ఓసీలు, ఎల్‌ఆర్‌ఎస్‌, 21 రోజుల్లో అనుమతి సేవలు టీఎస్ బీపాస్ లో అందుబాటులో ఉంటాయి. జలమండలి, ఎలక్ట్రిసిటీ, టీడీఆర్‌, ఎస్‌ఆర్‌ఓ, నీటి పారుదల, జేఎన్‌టీయూ, విమానాశ్రయం, ఎన్‌ఎంఏ విభాగాలకు సంబంధించి ఒకే చోట ఎన్‌ఓసీలు అందజేస్తారు.  


దరఖాస్తు ఇలా చేసుకోండి


టీఎస్‌ బీ పాస్‌ వెబ్‌సైట్‌ www.tsbpass.telangana. gov.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యజమానులు, డెవలపర్స్, ప్రతినిధులు మీ సేవ కేంద్రం, టీఎస్‌ బీపాస్‌ మొబైల్‌ యాప్‌ లో నిర్మాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ 040-22666666 అందుబాటులోకి తెచ్చారు.  


మూడు కేటగిరిల్లో అనుమతులు   


 75 చదరపు గజాలు (63 చ.మీ) వరకు ఏరియా ఉంటే ప్లాట్లు, 7 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉండే భవనానికి తక్షణ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు, స్వీయ ధ్రువీకరణతో జారీ చేస్తారు.  కేవలం రూపాయి ఫీజుతో యాజమాన్య వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 63 చ.మీకి పైన, 500 చ.మీ ఏరియా వరకు ఉండే నివాస ప్లాట్లకు , 10 మీటర్ల వరకు ప్రతిపాదించిన భవన ఎత్తు స్వీయ ధ్రువీకరణ విధానం కింద తక్షణ ఆన్‌లైన్‌ లో ఆమోదిస్తారు. 500 చ.మీకి పైన ఉండే నివాస ప్లాట్లు, 10 మీ కన్నా ఎక్కువ ప్రతిపాదించిన బిల్డింగ్‌ ఎత్తు కలిగి ఉండి, అన్ని రకాల నివాసేతర భవనాలకు సింగల్‌విండో ఆమోద విధానంలో అనుమతులు జారీ చేస్తారు. 


Also Read : MIM Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ కేసులో హైకోర్టు నోటీసులు