Hyderabad News : హైదరాబాద్‌కు మరో అరుదైన ఘనత లభించింది. ప్రపంచ హరిత నగరాల అవార్డులు 2022లో హైదరాబాద్‌కు కీలక అవార్డు లభించింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హరిత హారాన్ని ఏర్పాటు చేసినందున..పురస్కారం లభించింది. లివింగ్ గ్రీన్ కేటగిరీ కింద ఈ అవార్డు వచ్చింది. కొరియాలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం వల్లనే ఇది సాధ్యమయిందని ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రకటించారు.
హైదరాబాద్‌కు గ్రీన్ అవార్డులు రావడం ఇదే మొదటి సారి కాదు. గత రెండేళ్లుగా ట్రీ సిటీ పురస్కారాలను హైదరాబాద్ అందుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్ వివరాలతోపాటు పలు కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో చేపట్టిన హరితహారం కారణంగా ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2021’గా ప్రకటిస్తున్నట్టు ఎఫ్‌ఏవో, అర్బన్ డే ఫౌండేషన్ గతంలో వెల్లడించాయి. అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో హైదరాబాద్ ప్రపంచంలోని పలు నగరాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రతినిధులు ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం, మినీ అడవుల ఏర్పాటుతో హైదరాబాద్‌ను అత్యంత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దారని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జిహెచ్‌ఎంసితో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హరిత భవిష్యత్ కు గాను మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకై ఐదు ప్రధాన లక్ష్యాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ ప్రజలకు ఆహ్లాదం పంచుతోంది. మెరుగైన జీవనాన్ని అందిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ అవార్డులు నగరానికి వస్తున్నాయి.