తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ది పాదయాత్ర కాదని.. బీజేపీ కార్యకర్తల ఉరేగింపు యాత్ర మాత్రమే అని ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదని, బీజేపీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ కన్నా బీజేపీ ప్రజలకు చేసిన మేలు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును ప్రజలు పోల్చుకుని కేసీఆర్ పాలనకు బ్రహ్మ రథం పడుతున్నారని తెలిపారు. ప్రజలతో చర్చించడానికి సమస్యలు లేవు కనుకే సంజయ్ మతపరమైన అంశాలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. 


కేసీఆర్ పాలనలో అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారని, దీన్ని జీర్ణించుకోలేక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వెల్లివిరుస్తున్న మత సామరస్యాన్నిచెడగొట్టాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనబడుతోందని ఆరోపించారు. బండి సంజయ్ యాత్ర పావలాకు కూడా పనికి రాని యాత్ర అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు గుజరాత్ తరహాలో నిధులిచ్చి తమ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ఏదైనా అంటే ఆలోచిస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏ సాయం చేయకుండా పని చేస్తున్న కేసీఆర్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.  


బీజేపీ ప్రజలకేం చేసిందో చెప్పండి: ప్రకాష్ గౌడ్ 
కనీసం హైదరాబాద్ చరిత్ర తెలియకుండా.. పేర్లు మారుస్తా అని బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బీజేపీ ప్రజలకేం చేసింది, అధికారంలోకి వస్తే ఏం చేయనుందో పాదయాత్రలో చెప్పాలని స్పష్టం చేశారు. బండి సంజయ్ యాత్ర పావులాకు కూడా పనికిరాని యాత్రని కాలె యాదయ్య అన్నారు. ప్రజలు లేకపోతే బస్సుల్లో తీసుకొచ్చి యాత్ర కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి లీడర్ తెలంగాణలో మరొకరు లేరని.. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఖాయమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత లేదని.. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. 


Also Read: Breaking News: మొదటి రోజు 40 శాతం విద్యార్థులు వచ్చారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి


Also Read: Dalit Bandhu Telangana:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 4 మండలాల్లో దళిత బంధు అమలు