Breaking News: కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్‌డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 01 Sep 2021 06:10 PM
కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్

కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. శ్రీశైలం విద్యుత్  పైఇరు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాట కోసం తెలంగాణ పట్టుబట్టింది. 5 గంటలకుపైగా సమావేసం జరిగింది.

బాలీవుడ్ సీనియర్ నటి సైరా బాను పరిస్థితి విషమం.. ఐసీయూ వార్డులో చికిత్స

ఇటీవల కన్నుమూసిన వెటరన్ నటుడు దిలీప్ కుమార్ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి సైరా బాను ఆరోగ్యం మరింత విషమించింది. మూడు రోజుల కిందట బీపీ సమస్యతో ముంబైలోని ఖార్ ఆసుపత్రిలో చేరిన సైరా బాను పరిస్థితి విషమించడంతో ఆమెను ఐసీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బీసీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వకుళాభరణం

నూతనంగా నియమితులైన బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రద పటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్, విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 

మొదటి రోజు 40 శాతం విద్యార్థులు వచ్చారు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్కూళ్లకు 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. బుధవారం విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. 

Dalit Bandhu: మరో 4 మండలాల్లో దళిత బంధు అమలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాలలో వర్తింపచేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఎస్సీ నియోజకవర్గాలలో ఒక్కో మండలంలో దళిత బంధును అమలు కానుంది. 


ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం చింత‌కాని మండ‌లం, 
సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి మండ‌లం, నాగర్‌క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలాలలో అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు వర్తింపజేయనున్నారు.

మాజీ సీఎం భార్య మృతి

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్​సెల్వం భార్య విజయలక్ష్మి(63) ఈరోజు కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

మహిళా వాలంటీరు ఆత్మహత్య

నమ్మిన వ్యక్తే డబ్బుల కోసం చిత్రహింసలకు గురిచేశాడనే మనస్తాపంతో మహిళా వాలంటీరు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని గోపాలపురం మండలం కోమటికుంటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోమటికుంట గ్రామానికి చెందిన కొండపల్లి సత్యవతి (31) భర్త ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. 2 ఏళ్లుగా గ్రామ వాలంటీరుగా పని చేస్తోంది. అదే గ్రామానికి చెందిన దారం రాకేష్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. రాకేష్ పెళ్లి చేసుకుంటానని సత్యవతిని నమ్మించాడు. ఈ క్రమంలో రాకేష్‌ తరచూ డబ్బులు ఇవ్వాలని ఆమెను బెదిరిస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన సత్యవతి.. ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ ఘటనపై సత్యవతి తల్లి మీసాల చంటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పాఠశాలల స్థలాల్లో సచివాలయాలను తొలగించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పాఠశాల స్థలాల్లో ఉన్న ఆర్‌బీకేలు, సచివాలయాల నిర్మాణాలను నాలుగు వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పాఠశాల స్థలాల్లో ఉన్న ఆర్‌బీకేలు, సచివాలయాల నిర్మాణాల గురించి హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 1,160 చోట్ల ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు పేర్కొంది. వాదనలు విన్న హైకోర్టు.. మిగతా నిర్మాణాలను సైతం 4 వారాల్లో తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబరు 1కి వాయిదా వేసింది. ఐఏఎస్​ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బి.రాజశేఖర్, వి.చినవీరభద్రుడు, శ్యామలారావు, విజయ్‌కుమార్, ఎం.ఎం.నాయక్  హైకోర్టుకు హాజరయ్యారు. 

ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్టు.. మావోలతో సంబంధాలున్నాయని అనుమానం

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన పృథ్వీరాజ్‌.. పూసుగుప్ప-ఛత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్లుగా తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన శైలేంద్ర ముఖర్జీ ఆగస్టు 7వ తేదీన చనిపోయాడు. ఆయన ఆశయాలను కొనసాగించాలని రాసి ఉన్న కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పృథ్వీరాజ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించినట్లు వెల్లడించారు. 

Background

ఒక మహిళ తన అత్త తలపై చపాతీ కర్రతో బలంగా కొట్టి హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉండే ప్రియాంక అనే మహిళ తన అత్త మైధిలిపై చపాతీ కర్రతో దాడికి పాల్పడింది. తలపై గట్టిగా కొట్టడంతో మైధిలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అత్త వేధింపులు భరించలేకే ప్రియాంక ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.