హుజూరాబాద్ ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ లో పార్టీ అభ్యర్థి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వెంకట్ మంచి లీడర్ అవుతారని తెలిపారు. హుజూరాబాద్ ప్రజల కోసం భవిష్యత్తు లో పోరాటం చేస్తాడన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత తనదేనని స్పష్టం చేశారు.
'నివేదికలు తెప్పించుకొని విశ్లేచన చేసుకుంటాం. రాబోయే రోజులన్ని కాంగ్రేస్ పార్టీవే. ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడుతాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయి. ఉపఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవు. గత ఎన్నికల్లో బీజేపీకి 16 వందల ఓట్లు మాత్రమే వచ్చాయి.. ఇప్పుడు గెలిచింది. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బీజేపీ కనిపించలేదు. మీ కోసం నేను ఉంటా- ఈ ఓటమి నన్ను కుంగదియ్యదు. ఈ ఫలితాలు-హుజూరాబాద్ ఎన్నికపై భవిష్యత్ స్పందిస్తా.' అని రేవంత్ అన్నారు.
ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరాశ నుంచి నిర్మాణం చేపడుతామన్నారు. కాంగ్రేస్ లో సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందన్నారు. పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటామన్నారు. సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో కలుపుకొని వెళతామన్నారు.
అయితే మరోవైపు.. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఉపఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్.. ఈటల రాజేందర్ ను పట్టించుకోలేదన్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ ఒక్క సభ పెట్టలేదన్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో పని చేసినట్లుగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పని చేయలేదన్నారు. కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో గట్టి క్యాడర్ ఉన్నా, తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యిందన్నారు. హుజూరాబాద్ పై వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు విమరిస్తానని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఈటలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ 5 నెలల్లో 5 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. అంత డబ్బు పంచినా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ కు దిమ్మతిరిగే తీర్పు ఇస్తున్నారన్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువైన ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ పార్టీకే లబ్ది కలుగుతుందన్నారు. ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికతో టీఆర్ఎస్ గెలిచి మళ్లీ ప్రజలను మభ్యపెడతారని అందుకే ఈసారి కాంగ్రెస్ కాస్త వెనక్కు తగ్గిందన్నారు. ఈటలకు పరోక్ష మద్దతును ఇవ్వాల్సి వచ్చిందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.
Also Read: Huzurabad Harish : "ఫలితం" అనుభవించాల్సింది హరీష్ రావేనా !?