Threatening call to Raja Singh: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)కు బెదిరింపు కాల్ వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర (Shoba Yatra) చేపడితే ఆయన్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు ఎవరు కాల్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, గతంలోనూ తనకు ఇదే విధంగా బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ తెలిపారు.


రాజాసింగ్ సవాల్


అయితే, తనకు ఫోన్ చేసి బెదిరించడంపై రాజాసింగ్ స్పందించారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని.. ఇలాంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవని అన్నారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని.. వారికి నిజంగా దమ్ముంటే తన ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలని సవాల్ విసిరారు. తనకు కొన్ని నెంబర్ల నుంచి ఈ కాల్స్ వచ్చాయంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


గతంలోనూ కాల్స్


కాగా, రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు ఆయనకు ఇలాంటి కాల్స్ వచ్చాయి. కొంతకాలం కిందట ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రాగా.. అవి పాకిస్థాన్ నుంచి వచ్చాయంటూ ఆయన సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. దీనిపై అప్పటి డీజీపీ అంజనీ కుమార్ కు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ తనకు వచ్చిన ఫేక్ కాల్స్ అన్నింటి వివరాలను రాసుకున్నట్లు రాజాసింగ్ వెల్లడించారు.


Also Read: Bandi Sanjay: ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలుతుంది, ఎమ్మెల్యేల్ని కొనేలా కేసీఆర్ ప్లాన్ - బండి సంజయ్ సంచలనం