EC To Jagadeesh Reddy :  తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించిది. ఎన్నికల ర్యాలీలు, బహిరంగసభల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎన్నికల అంశంపై మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. ఈ ఆంక్షలు శనివారం సాయంత్రం అమల్లోకి వచ్చాయి. సోమవారం సాయంత్రం వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని ఎన్నికల ప్రచారంలో జగదీష్ రెడ్డి ఓటర్లను హెచ్చరించారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలను అందించారు.


 


టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే ప థకాలు ఆపేస్తామని బెదిరించారని ఫిర్యాదులు


బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం...ఓటర్లను బెదిరించిన అంశంపై జగదీష్ రెడ్డిని వివరణ అడిగింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు జగదీష్ రెడ్డి వివరణ పంపారు. అయితే జగదీష్ రెడ్డి వివరణపై ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది.  మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను నెత్తినెత్తుకున్న జగదీశ్వర్ రెడ్డి.. గత కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ప్రచారానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే మునుగోడులోనే ఉండి.. ఎన్నికలను పర్యవేక్షించడానికి అవకాశం ఉంది.


 జగదీష్ రెడ్డి వివరణపై సంతృప్తి చెందన్ని ఎన్నికల సంఘం 



మునుగోడులో ఓటమిపాలవుతామనే అడ్డదారుల్లో బీజేపీ కుట్రలకు పాల్పడుతూ, చిల్లర ప్రయత్నాలు చేస్తోందని నోటీసులు అందిన సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.  . టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తాను మాట్లాడినట్లు ఈసీ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.  ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక విషయంలో ఈసీ పలు రకాల కఠిన చర్యలు తీసుకుంది.  మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యుగ తులసి పార్టీకి సంబంధించి డ్రాలో వచ్చిన రోడ్డు రోలర్ గుర్తు ను తొలగించి బేబీ వాకర్ గుర్తు కేటాయించడంపతో రిటర్నింగ్ ఆఫీస్‌ను విధుల నుంచి తప్పించడమే కాకుండా సస్పెండ చేసింది.


ఎన్నికల నియామవళి అమలు పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం 


ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థి పలు గ్రామాల ఓటర్లను యాదాద్రికి తీసుకెళ్లి తనకే ఓటు వేసేలా ప్రమాణం చేయిస్తున్నారన్న ప్రచారం జరిగింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈసీ తక్షణం స్పందించి..విచారణ చేయించింది. నిజమేనని తేలడంతో ఈసీ ఆ ఖర్చు అంతా అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది. ఈసీ తమ విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తోందని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


నవంబర్ 12న తెలంగాణలో మోదీ టూర్ - కేసీఆర్ హాజరవుతారా ?