Modi Telangana Tour : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. 11వ తేదీన ఏపీలోని విశాఖపట్నంలో కొత్త రైల్వే స్టేషన్ శంకుస్థాపనకు హాజరు కానున్నారు. ఆ రోజు విశాఖలోనే బహిరంగసభలో పాల్గొననున్న మోదీ.. తర్వాతి రోజు అంటే 12వ తేదీ  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని  ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎరువుల కర్మాగారంతోపాటు ఎన్టీపీసీ టౌన్ షిప్,  మహాత్మా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్,  ప్రధాని సభ ప్రాంగణం, ఎరువుల కర్మాగారంలో ప్రధాని వెళ్లే రూట్ మ్యాప్ ను కేంద్ర అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. నిజానికి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.   2021 మార్చి 23న పరిశ్రమలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. నవంబర్ 12న ప్రధాని కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.


రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న మోదీ 


2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్‌ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్‌ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్‌ బ్రాండ్‌’పేరుతో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ చేస్తోంది.


మోదీ చొరవతో ప్రారంభమైన రామగుండం ఫ్యాక్టరీ 


గతంలో మూత బడిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ప్రధాని మోడీ చొరవ చూపి తిరిగి తెరిపించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణకే కాక దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుంది. ఆయా రాష్ట్రాలలో అన్నదాతలకు యూరియా అందుబాటులోకి వచ్చింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు.  


ప్రధాని మోదీ ప్రయటనలో కేసీఆర్ పాల్గొంటారా ?


ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ..  ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు కావడం ఆసక్తి రేపుతోంది. మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది చివరి వరకూ సస్పెన్స్ గానే ఉంటుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వానికీ భాగస్వామ్యం ఉంది. అందుకే సీఎం ఖచ్చితంగా పాల్గొనాలని అంటారు. ఏపీలో రైల్వే స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ పాల్గొంటున్నారు. ఇక్కడ కేసీఆర్ పాల్గొనడం మాత్రం డౌటేనని చెప్పవచ్చు.  మోదీ పర్యటన ... ఆ తర్వాత బహిరంగసభ కూడా ఉండనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది. 


బీజేపీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణపై స్టే!