రాయలసీమకు న్యాయ రాజధానిని తీసుకురావాలని మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారాయన. ఈ కార్యక్రమంలో వేల మంది మహిళలు, యువకులు పాల్గొని మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు.
కృష్ణాపురం ఠాణా నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్, ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో వేల మంది ప్రజలు గాంధీ రోడ్డు తిలక్ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతిలో జరిగిన ఆత్మ గౌరవ మహా ప్రదర్శన పట్ల ప్రజల స్పందన తెలియజేసేందుకు ఇది ఒక రిహార్సల్స్ మాత్రమే అన్నారు. అంచనాలకు మించి ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారని పేర్కొన్నారు.
రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పలాని నిలదీశారు. రాయలసీమవాసిగా ఇప్పుడు కూడా సీమ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును సీమ ప్రజలు క్షమించరని అన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వలనే నేడు రాయలసీమలో నీటి ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. జనం విడిచి సాము చేస్తున్న చంద్రబాబు, నేటి తిరుపతి స్పందనను గ్రహించాలని హితవు పలికారు.