Vishnu Vardhan Reddy Visits Tirumala Temple: తిరుపతి‌: బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని విష్ణు వర్థన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ రాజకీయాలు దేశ ప్రజలలో ఆందోళన పెంచుతున్నాయని చెప్పారు. స్థానిక పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధక పాలనే సాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్ పదేళ్లు వెనక్కి పోగా, ఇప్పుడు వైసీపీ పాలనతో మరో ఇరవై ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు 
వైసీపీ చేతగానితనాన్ని ఎండగడతాం..
కుటుంబ పాలనే పరమావధిగా నాడు టీడీపీ, నేడు వైసీపీ వ్యవహరిస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 18 నెలలు వైసీపీ చేతగానితనాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ, జనసేన ప్రజా అవగాహన ఉద్యమాలు చేపడుతున్నాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పధంలో నడవాలి అంటే అది కేవలం బీజేపీ, జనసేనలతోనే సాధ్యం అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడ ప్రమాదకరమైనది అన్నారు. సంతలో పశువుల్లా కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గత మూడు రోజులుగా నీచ రాజకీయాలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. నేడు దేశంలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ చేపట్టి పాదయాత్ర భారత్ జోడో యాత్రను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. 2024లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదు అని జోస్యం చెప్పారు.


తిరుమలలో‌ భక్తుల రద్దీ 
తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం సేవలో నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం 28-10-2022 రోజున 63,512 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 35,549 మంది తలనీలాలు సమర్పించగా, 3.72 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట క్యూలైన్స్ లో శిలాతోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.


శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు..
తిరుమల శ్రీవారి‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్మృతి ఇరానీ దంపతులు స్వామి వారి ఆశీస్సులు పొంది మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనార్ధం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులకు టీటీడీ‌ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు స్మృతి ఇరానీ దంపతులను పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.