తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమంతా పక్కా వ్యూహంతో జరిగిందని పోలీసులు వివరించారు. దీని కోసం నాలుగు రహస్య కమెరాలు, రెండు వాయిస్ రికార్డర్ల వాడినట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆపరేషన్ చేపట్టామన్నారు.
ముగ్గురు వ్యక్తులు తమకు వంద కోట్లు ఇస్తామని... ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆఫర్ ఇచ్చినట్టు రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు. ఈ అనైతిక చర్యను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో చెప్పారన్నారు.
రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతోనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో మీటింగ్ గదిలో నాలుగు సీక్రెట్ కెమెరాలు ఉంచారు. వీటిని మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ చేశారు. రోహిత్ రెడ్డి కుర్తా జేబులో రెండు వాయిస్ రికార్డర్‌లు పెట్టారు.
అనుకున్నట్టుగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చిన నిందితులు మూడు గంటల పది నిమిషాలకు ఫామ్ హౌస్‌లోని కెమెరాలు పెట్టిన గదిలోకి వచ్చారు. అక్కడికి ఓ గంట తర్వాత అంటే నాలుగు గంటలకు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు సమావేశానికి వచ్చారు. సుమారు మూడున్నర గంటల పాటు వీళ్లందరి మధ్య చర్చలు జరిగాయి.
మీటింగ్ ముగిసింది అని చెప్పడానికి రోహిత్ రెడ్డికి పోలీసులు ఓ కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. దాని ప్రకారమే... మీటింగ్ నుంచి కొబ్బరి నీళ్ల కోసం ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ కొబ్బరి నీళ్లే కోడ్ అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పారు.
కొబ్బరి నీళ్లకు పని మనిషి బయటకు రాగానే.. పోలీసులు సమావేశం జరుగుతున్న హాల్‌లోకి వెళ్లారు. నిందితులను స్పాట్‌లోనే ప్రశ్నిస్తే ఎలాంటి విషయాలు చెప్పలేదని... తర్వాత అక్కడ ఉన్న ప్రాపర్టీ మొత్తం సీజ్ చేశామన్నారు పోలీసులు.
సీజ్ చేయడానికి ముందు రోహిత్ రెడ్డి జేబులో ఉన్న వాయిస్ రికార్డులు విన్నప్పుడు డబ్బులు ఆఫర్ చేసిన విషయం స్పష్టంగా వినిపించని... వారి మాట్లాడుకునే వాయిస్ మొత్తం రికార్డైందన్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగమే జరిగిందని... రామచంద్రభారతి చెప్పిన విషయం రికార్డైంది. తుషార్‌కు రామచంద్రభారతి ఫోన్ చేసిన ఆడియో కూడా అందులో ఉంది. తెలంగాణకు సంబంధించిన ఓ ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ బన్సల్‌కు రామచంద్రభారతి ఎస్‌ఎంఎస్ పంపారన్న విషయాన్ని ఫోన్‌లు సీజ్ చేసిన తర్వాత పోలీసులు తెలిపారు. దాని స్క్రీన్‌షాట్ కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు.
తెలంగాణ మొత్తం పాతిక మంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని... సంతోష్ బీజేపీ పేరుతో ఉన్న నెంబర్‌తో రామచంద్రభారతి చేసిన వాట్సాప్ చాట్ రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టారు.
నందు డైరీ చూస్తే మరిన్ని వివరాలు తెలిశాయన్నారు పోలీసులు. అందులో యాభై మంది టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్టు తెలిపారు. మిగతా ముగ్గురు రోహిత్ రెడ్డికి హెల్ప్ చేయడానికి మాత్రమే స్పాట్‌కు వచ్చినట్టు రిపోర్ట్‌లో తెలిపారు పోలీసులు.