ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 52 వ రోజుకు చేరుకోగా, తెలంగాణలో 4వ రోజు పాదయాత్ర నేటి ఉదయం ప్రారంభమైంది. ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర మొదలుపెట్టగా.. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర కొనసాగుతోంది. ఏనుకొండలో ఉదయం 10. 30 గంటలకు విరామం తీసుకోనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్. రాహుల్ గాంధీ వెంట పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్యే సీతక్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


రాహుల్ పాదయాత్రలో నటి పూనమ్ కౌర్..
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు పూనమ్ కౌర్. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్  ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలో కొనసాగుతోంది. 


ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, పీహెచ్ డీ స్కాలర్స్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు నేడు రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. యూనివర్సిటీ సమస్యలు రాహుల్ గాంధీకి వివరించారు. వారి సమస్యలపై ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతూ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు..
ప్ల కార్డుల్లో అంశాలను రాహుల్ గాంధీ గమనించి వారిని అడిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.






జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్
ఏనుకొండలో ఉదయం 10. 30 గంటలకు విరామం తీసుకోనున్న రాహుల్ గాంధీ తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ ఉంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద రాహుల్ రాత్రి బస చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. 4 వ రోజు 20.3 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ యూత్ కాంగ్రెస్ భారీ సంఖ్యలో రాహుల్ యాత్రలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. నేటి సాయంత్రం జడ్చర్ల జంక్షన్ లో జరగనున్న రాహుల్ కార్నర్ మీటింగ్ విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.